Mahaa Daily Exclusive

  చంచల్ గూడ సికాలో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి శిక్షణ…. ప్రారంభించిన డిజిపి బి. శివధర్ రెడ్డి….

Share

హైదరాబాద్, మహా : జైలు శాఖలో ఉద్యోగం అనేది కేవలం ఖైదీలను నాలుగు గోడల మధ్య బంధించడం మాత్రమే కాదని, వారిలో పరివర్తన తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిపే గురుతర బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో బుధవారం ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల ప్రాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. జైళ్ల శాఖ నిర్వహణ అత్యంత సంక్లిష్టమైనదని, శిక్షణార్థులు వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఖైదీల పట్ల గౌరవభావంతో మెలిగినప్పుడే ఆశించిన సంస్కరణలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. తెలిసో, తెలియకో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మార్పు తీసుకువచ్చి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించేలా వారిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరిట అడపా దడపా వస్తున్న విమర్శలను జైళ్ళ శాఖలో ఉద్యోగం చేస్తున్నవారు ఎదుర్కొంటుంటారని పేర్కొన్నారు. శిక్షణలో అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, వార్డర్లకు విలువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమంలో జైళ్ల శాఖ డిజి డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సహకారం ద్వారానే సంస్కరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంద అన్నారు. ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మన సికాపై నమ్మకంతో ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బందిని శిక్షణకు పంపడం గర్వకారణమన్నారు గతంలో తిహార్ జైలు సిబ్బందికి, బీపీఆర్ అండ్ డి ప్రమాణాలతో సికా అందించిన శిక్షణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. ఆధునిక జైలు పరిపాలన ప్రస్తుతం హక్కుల ఆధారిత విధానాల వైపు పయనిస్తోందని, శిక్షణార్థులు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇండోర్, అవుట్‌డోర్ అంశాల్లో మెళకువలు నేర్చుకుని సానుకూల మార్పుకు దోహదపడాలని కోరారు. మొత్తం 381 మంది ఢిల్లీ సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనుండగా, మొదటి బ్యాచ్‌లో 62 మంది శిక్షణార్థులు (18 మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, 43 మంది మహిళా వార్డర్లు, తెలంగాణ నుండి ఒకరు) చేరారు. వీరికి క్రిమినాలజీ, సైకాలజీ, మానవ హక్కులు మరియు జైలు పరిపాలనలో సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో శిక్షణకు అవసరమైన కిట్లను ట్రైనీ లకు అందజేశారు. జైళ్ళ శాఖ ఐజీ ఎన్. మురళీ బాబు, డీఐజీలు డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, సికా ప్రిన్సిపల్ ఎస్. శ్రీనివాస రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

డిజిపి జన్మదినం కార్యక్రమం

ఈనెల 28వ తేదీన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి .శివధర్ రెడ్డి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని శిక్షణ కార్యక్రమం సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు కేక్ కట్ చేశారు. జైళ్ళ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐజి మురళి బాబు తదితరులు డిజిపి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.