Mahaa Daily Exclusive

  సేవాదళ్‌ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులు..

Share

  • సేవాదళ్‌ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులు
  • రాజకీయాలు అంటే నేడు అర్థం మారిపోయింది
  • నేను. నాది’ అనే స్వార్థం పెరిగి, ‘మనం.. మనది’ అనే సామాజిక స్పృహ తగ్గిపోతోంది
  • ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌, మహా : కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ అనేది కేవలం ఒక విభాగం మాత్రమే కాదని, అది క్రమశిక్షణకు మారుపేరుగా, అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టీపీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’ శిక్షణా శిబిరానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్య్ర‌ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో సేవాదళ్ వాలంటీర్లు ఎప్పుడూ ముందుంటారని, పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి శిబిరాల ద్వారా కార్యకర్తల్లో నాయకత్వ పటిమతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇది పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇవాళ రాజకీయాల్లో అర్థాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ‘నేను.. నాది’ అనే స్వార్థం పెరిగిపోయి, ‘మనం.. మనది’ అనే సామాజిక స్పృహ తగ్గిపోతోందన్నారు. రాజకీయాల్లో కేవలం ఎలా సంపాదించుకోవాలనే ధ్యాస పెరిగి, సేవాభావం క్రమంగా క్షీణిస్తోందని అభిప్రాయపడ్డారు. సమాజంలో నేటికీ ఎంతోకొంత విలువలు మిగిలి ఉన్నాయంటే అది సేవాదళ్ వంటి నికార్సైన నాయకులు, వాలంటీర్ల కృషి వల్లేనని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యర్థులు సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టేలా కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న సేవాదళ్ కార్యకర్తలకు గుర్తింపు దక్కేలా చూస్తానని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నిబద్ధతతో పని చేస్తున్న వారికి నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా అవకాశం కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.