Mahaa Daily Exclusive

  అన్నదాతల గోస పట్టదా?

Share

* అబద్ధాల్లో ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు.
* పౌరసరఫరాలపై అవగాహన లేని అసమర్థుడు.
• మంత్రి తుమ్మలపై బండి సంజయ్ నిప్పులు.

హైదరాబాద్‌, మహా.
తెలంగాణలో అన్నదాతల సమస్యలపై రాజకీయ సెగలు రాజుకున్నాయి. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరును తప్పుబడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ తాను రాసిన లేఖలపై నిర్మాణాత్మక చర్చలు జరపాల్సింది పోయి, ఎదురుదాడికి దిగడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారశైలిపై సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలోనూ, అవగాహన రాహిత్యంలోనూ తుమ్మల నాగేశ్వరరావుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేని కబోధిలా మంత్రి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ మేనిఫెస్టోపై అవగాహన లేని వ్యక్తి వ్యవసాయ మంత్రిగా ఉండటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న దురదృష్టమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కోసం చట్టం తెస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రానిదేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ధరను కేంద్రం నిర్ణయిస్తే, దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కనీస సోయి మంత్రికి లేకపోవడం శోచనీయమన్నారు. దాదాపు 20 లక్షల మంది రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదన్న నిజాన్ని ప్రభుత్వమే అంగీకరించిందని, అటువంటప్పుడు రైతులు క్షేమంగా ఉన్నారని ఏ మొఖం పెట్టుకుని చెబుతున్నారని ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన వంటి అద్భుతమైన పథకాన్ని పక్కనపెట్టి, రెండేళ్లు గడుస్తున్నా ప్రత్యామ్నాయ పంట బీమా పథకాన్ని తీసుకురాలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు.
ధాన్య సేకరణలో కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని బండి సంజయ్ గణాంకాలతో సహా నిరూపించారు. రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ సేకరిస్తున్న ధాన్యంలో సింహభాగం కేంద్రమే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. గత ఖరీఫ్ సీజన్ లో సేకరించిన 71.86 లక్షల మెట్రిక్ టన్నుల్లో 60 లక్షల మెట్రిక్ టన్నులను, రబీ సీజన్ లో 74.22 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 50.10 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రమే తీసుకుందని వివరించారు. ఈ సీజన్ లో గత రబీ కంటే మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు అందించిందని, వడ్ల కొనుగోలుకు అవసరమైన ప్రతి పైసాను కేంద్రమే భరిస్తోందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎరువుల పంపిణీని కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థతలో మంత్రివర్గం ఉందని, ఖమ్మం గడప దాటి బయటకు వస్తేనే రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలు తెలుస్తాయని సంజయ్ హితవు పలికారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ. 5 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్రం ఏటా ఇచ్చే రూ. 400 కోట్ల నిధుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ చేసిన చట్టాలను నల్ల చట్టాలని వ్యవసాయ మంత్రి వ్యాఖ్యానించడం రాజ్యాంగ ద్రోహమని, ఆయన వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాజకీయ నిందారోపణలు మాని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రబీ వడ్లకు బోనస్ చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.