*అస్తిత్వ సంక్షోభంలో ఎర్రజెండా.. దేశంలో కమ్యూనిస్టుల అధికారానికి తెర!
*కేరళలో ఎల్డీఎఫ్ ఘోర పరాజయం.. చేజారిన చివరి కంచుకోట
*49 ఏళ్ల తర్వాత తొలిసారి దేశంలో అధికారం లేని దుస్థితికి వామపక్షాలు
*కాలంతో పాటు మారకపోవడం, పాత సిద్ధాంతాలకే పరిమితం కావడమే పతనానికి కారణమా?
హైదరాబాద్, మహా.
భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించి, పేదలు, కార్మికుల పక్షాన నిలిచిన ఎర్రజెండా తీవ్ర అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో కమ్యూనిస్టుల చివరి కంచుకోట బద్దలైంది. తాజా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఘోర పరాజయం పాలు కావడంతో.. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల అధికార పర్వానికి తెరపడినట్లయింది. గత 49 ఏళ్లలో దేశంలోని ఏదో ఒక మూల అధికారంలో కొనసాగుతూ వచ్చిన వామపక్షాలకు.. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అధికారం లేని గడ్డు పరిస్థితి దాపురించింది. కేరళలో పదేళ్ల పాటు సాగిన పినరయి విజయన్ పాలనపై వెల్లువెత్తిన వ్యతిరేకత వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న లెఫ్ట్ పార్టీల ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు.
**నాడు స్వర్ణయుగం.. ఏకఛత్రాధిపత్యం**
భారతదేశంలో 1920 దశకంలో మొగ్గతొడిగిన కమ్యూనిస్ట్ భావజాలం, 1925లో సీపీఐ ఆవిర్భావంతో సంస్థాగత రూపుదిద్దుకుంది. రష్యా బోల్షివిక్ విప్లవ స్ఫూర్తితో నాటి వలసవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటీష్ పాలకుల అణచివేతను ఎదుర్కొంటూ అజ్ఞాతవాసం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చైనా, రష్యా భావజాలాల మధ్య వచ్చిన విభేదాలతో 1964లో పార్టీ చీలిపోయి సీపీఐ(ఎం) ఆవిర్భవించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 1957లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ప్రజాస్వామ్యయుతంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకు ఏకబిగిన 34 ఏళ్ల పాటు లెఫ్ట్ ఫ్రంట్ ఏకఛత్రాధిపత్యం చలాయించింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ పాతిక ఏళ్ల పాటు వామపక్షాల పాలన నిరాటంకంగా సాగింది.
**కాలంతో మారక.. పాత సిద్ధాంతాలకే కట్టుబడి**
ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కమ్యూనిస్టులు కాలక్రమంలో తమ పట్టును కోల్పోవడానికి వారు కాలంతో పాటు మారకపోవడమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు సైతం మార్కెట్ సంస్కరణలకు తలుపులు తెరిస్తే.. భారత వామపక్షాలు మాత్రం దశాబ్దాల నాటి పాత మార్క్సిస్ట్ సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్నాయి. ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లకు దూరమయ్యారు. బెంగాల్‌లో ఒకప్పుడు విజయవంతమైన భూసంస్కరణలు చేపట్టి, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసినా.. తదనంతర కాలంలో పారిశ్రామిక ప్రగతిని విస్మరించడం, బంధుప్రీతి, సింగూరు, నందిగ్రామ్ వంటి హింసా రాజకీయాలు వారి పతనానికి దారితీశాయి. 2011లో మమతా బెనర్జీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన కమ్యూనిస్టులు.. తాజాగా 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా కనీస ప్రభావం చూపలేకపోయారు. అటు 2018లో త్రిపురను సైతం బీజేపీ కైవసం చేసుకోవడంతో వామపక్షాలు డీలా పడ్డాయి.
**మారుతున్న ప్రజల ప్రాధాన్యతలు.. దూరమవుతున్న ఓటర్లు**
మారుతున్న సామాజిక ముఖచిత్రం కూడా లెఫ్ట్ పార్టీలకు శాపంగా మారింది. దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరించడం, యువత వలసలు పెరగడంతో.. ప్రజల ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. నాటి వర్గ పోరాటాల స్థానంలో.. నేడు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, దేశాభివృద్ధికి ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. మారుతున్న ఈ ప్రజల ఆకాంక్షలను అందిపుచ్చుకోవడంలో, వాటికి అనుగుణంగా తమ విధానాలను మార్చుకోవడంలో కమ్యూనిస్టులు పూర్తిగా విఫలమయ్యారు. దీనికితోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంకుకు భారీ గండికొట్టింది. కమ్యూనిస్టుల సంక్షేమ అజెండాను ఇతర పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చుకోవడంతో వారికి రాజకీయంగా ప్రత్యేక స్థానం లేకుండా పోయింది.
**ఉనికి దక్కేనా.. కాలగర్భంలో కలిసేనా?**
జాతీయ స్థాయిలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) కేవలం 4, సీపీఐ 2 స్థానాలకే పరిమితం కావడం వారి బలహీనతను తేటతెల్లం చేసింది. తాజా కేరళ ఓటమితో పినరయి విజయన్ సర్కార్ సాధించిన సంక్షేమం, విద్య, వైద్య రంగాల ప్రగతి కూడా నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల ముందు నిలబడలేకపోయాయి. నేడు కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వ లేమితో, ముఖ్యంగా యువ నాయకత్వం కొరవడి వయోవృద్ధులైన నేతలతో సతమతమవుతున్నాయి. ఆర్థిక అసమానతలు, లౌకికవాదం వంటి అంశాలపై మేధోపరమైన పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయం లేని శక్తిగా ఉన్నప్పటికీ.. జాతీయవాదం, అభివృద్ధి నినాదాలతో దూసుకుపోతున్న బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ముందు వామపక్షాలు రాజకీయంగా నిలదొక్కుకోవడం కత్తిమీద సామే. ఆధునికతను సంతరించుకుని యువ నాయకత్వానికి పెద్దపీట వేయకపోతే రానున్న రోజుల్లో ఎర్రజెండా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది.







