*మంత్రి సొంత జిల్లాలో రైతన్న కంటతడి.
* దళారీల చేతిలో నిలువు దోపిడీ!
* తనికెళ్ల కొనుగోలు కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటన.
* ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోనే రైతుల కన్నీటి గాథలు హృదయాలను కలచివేస్తున్నాయి. వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డులో వారం, పది రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల దుస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మార్కెట్ అధికారుల జాడ లేకపోవడం, గన్నీ బ్యాగుల కొరత, ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడం, వానొస్తే కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు (పట్టాలు) కరువవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలకు వడ్లు, మొక్కజొన్నలు తడిసిపోతుంటే ఇదే అదనుగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. మద్దతు ధర దేవుడెరుగు.. కేవలం 1600 నుంచి 1700 రూపాయలకే దళారులకు తెగనమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. మరోవైపు హమాలీల శ్రమ దోపిడీ పరాకాష్టకు చేరుకుంది. ఒక్కో బస్తా కాటా వేసి, లారీకి ఎత్తడానికి ఏకంగా 55 నుంచి 70 రూపాయల వరకు, కొన్నిచోట్ల వంద రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని రైతులు ఎంపీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లారీలు సకాలంలో రాకపోవడం వల్ల ప్రైవేట్ ట్రాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోయారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విధించిన అసంబద్ధ నిబంధనల పట్ల రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంటే, అధికారులు మాత్రం కేవలం 26.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మిగిలిన సగం పంటను దళారులకు అమ్ముకుని రైతులు ఎందుకు నష్టపోవాలని ఆయన ప్రశ్నించారు. ఒక ఎకరంలో రైతు ఎన్ని క్వింటాళ్లు పండించినా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, గతంలో ఏ రకం వడ్లు పండించినా ప్రభుత్వం కొంటుందని గొప్పలు చెప్పిన నాయకులు.. ఇప్పుడు ‘పీఆర్ 126’ (PR 126) రకం వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఈ వడ్లను కొనమని నిరాకరించడంతో, మూడున్నర ఎకరాల వడ్లు కళ్లాల్లోనే ఉండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో, భూమి పాస్ పుస్తకం తన పేరు మీద లేదన్న ఒకే ఒక్క కారణంతో, చనిపోయిన ఒక కౌలు రైతు కుటుంబానికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందలేదన్న చేదు వాస్తవాన్ని ఎత్తిచూపుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
రైతుల కష్టాలను విన్న వెంటనే స్పందించిన ఎంపీ రఘునందన్ రావు.. అక్కడి నుంచే సొసైటీ సీఈఓ (CEO) బాలాజీకి ఫోన్ చేసి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. “కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా.. గత పది రోజులుగా రైతులు వానలో తడుస్తూ రోడ్ల మీద పడుకుంటే, కనీసం మార్కెట్ వైపు ఎందుకు రాలేదు? వడ్లు తరలించడానికి లారీలు, గన్నీ బ్యాగులు ఎందుకు పంపడం లేదు?” అని తీవ్ర స్వరంతో నిలదీశారు. తక్షణమే కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని, దళారుల దోపిడీని అరికట్టాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ వంటి కీలకమైన మంత్రి పదవులు ఉన్న ఖమ్మం జిల్లాలో రైతులకు ఇలాంటి ఖర్మ పట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఎంపీ విమర్శించారు. “ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడలేదు” అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గుర్తు చేశారు. మరో 48 గంటల్లోగా తనికెళ్ల కొనుగోలు కేంద్రానికి లారీలు, గన్నీ బ్యాగులు పంపించి, రైతుల ధాన్యాన్ని, మొక్కజొన్నను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే.. రెండు రోజుల తర్వాత రైతులందరినీ సమీకరించి, ఆ ధాన్యాన్ని లారీల్లో తీసుకువెళ్లి నేరుగా కలెక్టరేట్ ఆవరణలోనో లేదా మంత్రి క్యాంపు కార్యాలయంలోనో కుమ్మరిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కష్టకాలంలో రైతుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు,బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నీ ఉదయ ప్రతాప్ ,రుద్ర ప్రదీప్, వాకధాని పుల్లారావు యాదవ్, నాయకులు చిలుకూరు రమేష్, మందడపు సుబ్బారావు , ఆర్ వి ఎస్ యాదవ్, నరుకుల వెంకటేశ్వరరావు , బండారు నరేష్, వల్లభనేని పుల్లయ్య , కవిడ మురళి తదితరులు పాల్గొన్నారు.







