ఇండియా కూటమి కుట్రలకు ప్రజల గట్టి గుణపాఠం.
* తెలంగాణలోనూ కాషాయ జెండా ఖాయం.
*రోహింగ్యాలు, దొంగ ఓట్లతోనే దీదీ 15 ఏళ్ల పాలన..
*అస్సాంలో అవినీతి రహిత పాలనకే పట్టం కట్టిన ఓటర్లు.
*ఉత్తర, దక్షిణాల మధ్య చిచ్చుపెట్టిన వారికి తగిన శాస్తి.
*ద్రవిడ కోటలో తుడిచిపెట్టుకుపోయిన డీఎంకే..
* దేశమంతా మోదీ ప్రభంజనమే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు.
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలను నమోదు చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కుహనా లౌకికవాదంతో, ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నించిన ‘ఇండియా కూటమి’కి దేశ ప్రజలు తమ ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కోటను బద్దలు కొట్టడంతో పాటు, అస్సాంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం బీజేపీ పారదర్శక పాలనకు సజీవ సాక్ష్యమన్నారు. ఈ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయని, విపక్షాల ‘ఇండియా కూటమి’కి ప్రజలు తగిన శాస్తి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. దేశ ప్రగతిని అడ్డుకుంటూ, కేవలం మోదీ ద్వేషమే అజెండాగా బరిలోకి దిగిన ఇండియా కూటమి పార్టీలకు ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో ఆయా పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని, అసత్యపు ప్రచారాలను నమ్మే స్థితిలో దేశ ప్రజలు లేరని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఐదు రాష్ట్రాల్లో వెలువడిన ఈ అద్భుత ఫలితాలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతున్నాయని రాంచందర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలిస్తే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడం నూరు శాతం ఖాయమనే విషయం స్పష్టమవుతోందన్నారు. దేశమంతా వీస్తున్న కాషాయ పవనాలు త్వరలోనే తెలంగాణను సైతం తాకబోతున్నాయని, ఇక్కడి కుటుంబ, అవినీతి పాలనపై విసిగిపోయిన ప్రజలు స్పష్టమైన మార్పు కోసం కమలం వైపు చూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దారుణ పరాజయం పాలవ్వడంపై రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించి, లక్షలాది దొంగ ఓట్లను సృష్టించి మమతా బెనర్జీ గత 15 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బెంగాల్‌ను పాలించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దీదీకి అక్కడి ప్రజలు తమ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు.
దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోని బెంగాల్ గడ్డపై ఎట్టకేలకు కమలనాథులు చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత 33 ఏళ్ల పాటు వామపక్షాలు (కమ్యూనిస్టులు), ఆ తదనంతరం 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ పాలించిన దుర్భేద్యమైన ఆ కోటను బీజేపీ ముక్కలు చేసిందన్నారు. ఏకబిగిన 48 ఏళ్ల పాటు సాగిన వారి అరాచక పాలనకు బెంగాల్ ప్రజలు చరమగీతం పాడారని, అక్కడ తొలిసారిగా బీజేపీ ఘన విజయం సాధించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఎక్కడైతే అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన ఉంటుందో అక్కడ ప్రజలు మళ్లీ మళ్లీ ఆ ప్రభుత్వానికే పట్టం కడతారనడానికి అస్సాం ఫలితాలే సజీవ నిదర్శనమని రాంచందర్‌రావు తెలిపారు. సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ తో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే అస్సాంలో బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాయన్నారు.
కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కృత్రిమ వైషమ్యాలు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు గట్టి షాకిచ్చారని రాంచందర్‌రావు విమర్శించారు. దేశ సమైక్యతను దెబ్బతీసేలా వారు చేసిన విద్వేష ప్రచారాలను ఓటర్లు నిర్మొహమాటంగా తిరస్కరించారన్నారు. ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఆ పార్టీ అహంకారపూరిత విధానాలకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.







