Mahaa Daily Exclusive

  విద్యుత్‌ ఒప్పందాల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు….

Share

విద్యుత్‌ ఒప్పందాల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు.
* రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల సవరణ!
* రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.
* పెండింగ్ పన్నులకు ‘ఓటీఎస్’.. ఒకే గొడుగు కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు.
హైదరాబాద్, మహా.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న భారీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ వ్యవహారంపై తొలుత జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి, ఆ తర్వాత జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ కమిషన్‌ విచారణ జరిపి 2024 అక్టోబర్‌లో ప్రభుత్వానికి 114 పేజీల సమగ్ర నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) న్యాయ సలహాను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఇందులో అంతర్రాష్ట్ర వ్యవహారాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉన్నందున నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని భావించింది. దర్యాప్తు బదిలీ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్‌ విలువలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని (రేషనలైజేషన్‌) కేబినెట్‌ నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇస్తున్న పరిహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేసేలా రిజిస్ట్రేషన్‌ శాఖకు పచ్చజెండా ఊపారు. జిల్లాస్థాయిలోని కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకుని ఈ నెలాఖరు నాటికి నూతన విలువలను అమల్లోకి తేనున్నాయి. మరోవైపు, ‘హిల్ట్‌’ (HILT) పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. భూముల ధరలు పెరిగేలోపే దరఖాస్తు చేసుకున్న వారు ప్రాథమికంగా 10 శాతం మొత్తాన్ని చెల్లిస్తే, పాత ధరలనే వర్తింపజేయాలని నిర్ణయించింది. మిగిలిన 90 శాతం నిధులను 90 రోజుల్లోగా చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.
గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ), సైబరాబాద్‌, మల్కాజిగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోయిన ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నుల బకాయిల వసూలుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.5,864 కోట్లుగా ఉన్న ఈ బకాయిలపై వడ్డీలు, జరిమానాలు పూర్తిగా మాఫీ చేసి, అసలు మొత్తం రూ.1,686 కోట్లను ఓటీఎస్‌ కింద వసూలు చేయాలని మున్సిపల్‌ శాఖను ఆదేశించింది. జలమండలికి చెల్లించాల్సిన నీటి బిల్లుల బకాయిలను సైతం ఇందులో సర్దుబాటు చేయనున్నారు. అలాగే, రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు వెంటనే పంట నష్టం వివరాలు తెప్పించుకుని సహాయక చర్యలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రైతులు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లో 42 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునిక కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిని ఒకే గొడుగు కిందకు తెచ్చే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలు (అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు), పాలిటెక్నిక్‌ కళాశాలలు, టీ-శాట్‌ వ్యవస్థలను నూతనంగా ఏర్పాటైన ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. పాడి రైతుల సంక్షేమం కోసం నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని (నార్మాక్‌ – NARMAC) నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు (ఎన్‌డీడీబీ) అప్పగించే ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. ఇకపై డైరీ ప్లాంట్‌ నిర్వహణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ బాధ్యతలను ఎన్‌డీడీబీనే పర్యవేక్షించనుంది. సాగునీటి రంగానికి సంబంధించి ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్‌ ఫ్లడ్‌ ఫ్లో కాలువ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. దీనిద్వారా జిల్లాలోని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు సమృద్ధిగా నీరు అందనుంది. హరిత విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 18 చోట్ల 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్‌ పవర్‌ జనరేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రూ.66.50 కోట్ల అంచనా వ్యయంతో 19 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.