*అవమానకర కులాల పేర్లకు చెక్.. సంచార జాతులకు మహర్దశ!
*బీసీ కమిషన్ సిఫార్సులకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
*సీడ్ పథకానికి అర్హులైన డీఎన్టీ జాబితాకు ఆమోదముద్ర
*హర్షం వ్యక్తం చేసిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు
హైదరాబాద్, మహా.
సమాజంలో దశాబ్దాలుగా తమ కులాల పేర్లతోనే అవమానాలకు గురవుతున్న పలు అణగారిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సమాజంలో తిట్టు పదాలుగా చలామణి అవుతున్న పలు కులాల పేర్లను మారుస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సీడ్’ పథకం కోసం సంచార, విముక్త జాతుల (డీఎన్టీ) జాబితాను నోటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. తాము చేసిన సిఫార్సులను రాష్ట్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించడంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
**పూర్తి అధ్యయనం.. శాస్త్రీయంగా పేర్ల మార్పు**
గత 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన బీసీ కమిషన్.. క్షేత్రస్థాయిలో ఆయా వర్గాల స్థితిగతులపై బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కులాల వారు తమ పేర్ల వల్ల సమాజంలో నిత్యం ఎదుర్కొంటున్న వివక్షను, అవమానాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చి, తమ కులాల పేర్లను మార్చాలని వేడుకున్నారు. వారి అభ్యర్థనలను కూలంకషంగా పరిశీలించిన కమిషన్, పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలను సైతం స్వీకరించి, అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. దీని ప్రకారం.. దొమ్మర కులం పేరును ఇకపై ‘గడవంశీయ’గా మార్చనున్నారు. బీసీ జాబితాలోని ‘పిచ్చిగుంట్ల’ పదాన్ని శాశ్వతంగా తొలగించి కేవలం ‘వంశరాజ్’ను మాత్రమే కొనసాగించనున్నారు. తమ్మలి కులంతో పాటుగా ఉన్న అవమానకర ‘శూద్ర కులం’ పదాన్ని పూర్తిగా తొలగించనున్నారు. అలాగే బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ పదాన్ని జోడించి, ఆ పేరును అవమానకరంగా భావించే వారు ఇకపై సగర్వంగా ‘శివ క్షత్రియ’గా పిలువబడేలా అవకాశం కల్పించారు. చాకలి కులానికి ‘ధోబి’, మేర కులానికి ‘మేరు’ అనే పర్యాయపదాలను చేర్చారు. వీరభద్రీయ కులం పేరును ప్రధానంగా ప్రస్తావిస్తూ, దాని అనుబంధ కులాలైన వీరముష్టి, నెత్తి కోతల క్రమాన్ని సైతం బీసీ జాబితాలో మార్చాలని చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
**51 కులాలకు సంచార జాతుల హోదా.. ఆర్డీవో స్థాయిలోనే సర్టిఫికెట్లు**
కులాల పేర్ల మార్పుతో పాటు కేంద్ర ప్రభుత్వం సంచార, అర్థ సంచార, విముక్త జాతుల (డీఎన్టీ) కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘సీడ్’ పథకానికి అర్హులైన వారిని గుర్తించడంలోనూ బీసీ కమిషన్ కీలక పాత్ర పోషించింది. కేంద్ర డీఎన్టీ బోర్డు సూచనల మేరకు సమగ్ర అధ్యయనం చేసిన కమిషన్.. బీసీ-ఏ గ్రూపులోని 49 కులాలను, ఈ-గ్రూపులోని మరో 2 కులాలను సంచార జాతులుగా గుర్తించింది. వీరికి సంచార జాతుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు వీలుగా ప్రస్తుత కుల ధ్రువీకరణ పత్రాల నమూనాలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి దుర్వినియోగానికి తావులేకుండా ఉండేందుకు, నేరుగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) స్థాయి అధికారితోనే వీటిని జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ అభ్యర్థనలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.
**లబ్ధిదారులకు వరం.. 18 లక్షల మందికి ప్రయోజనం**
రాష్ట్రంలో ఈ ‘సీడ్’ పథకం పకడ్బందీ అమలుకు, కేంద్ర ప్రభుత్వంతో పాటు డీఎన్టీ బోర్డుతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో ఎంబీసీ కార్పొరేషన్ లేదా ఇతరత్రా ఏదైనా అధికారిక సంస్థను నోడల్ ఏజెన్సీ (అనుసంధానకర్త)గా నియమించాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్రానికేకంటూ ఒక ప్రత్యేకమైన సంచార జాతుల జాబితా ఉండటం వల్ల భవిష్యత్తులో ఆయా వర్గాలకు అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయని కమిషన్ చైర్మన్ నిరంజన్ వివరించారు. రాష్ట్ర సమగ్ర కులగణన సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ సంచార జాతుల జనాభా సుమారు 18,94,966 గా ఉన్నట్లు తేలిందని, వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రవేశపెట్టే ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది.







