*ప్రాణ భయంతో బంకర్లలోకి రష్యా అధ్యక్షుడు.
*ఇంటర్నెట్ బంద్.. పబ్లిక్ ఈవెంట్స్ రద్దు.
*అత్యంత గోప్యంగా భూగర్భంలో మకాం.
హైదరాబాద్, మహా.
ఒకప్పుడు తన కనుసన్నలతో ప్రపంచ గతిని శాసించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇప్పుడు ప్రాణ భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్రెయిన్‌పై ఆయన స్వయంగా ప్రకటించిన యుద్ధం, ఇప్పుడు ఆయనకే ముచ్చెమటలు పట్టిస్తోంది. తనను అంతమొందించేందుకు భారీ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయన్న పక్కా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో, క్రెమ్లిన్ బాస్ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అభద్రతాభావానికి లోనయ్యారు. రాజధాని మాస్కోలోని అధికారిక నివాసాలను విడిచిపెట్టి, క్రాస్నోడార్ ప్రాంతంలోని అత్యాధునిక సౌకర్యాలున్న అజ్ఞాత భూగర్భ బంకర్లకే ఆయన పూర్తిగా పరిమితమయ్యారని ఫైనాన్షియల్ టైమ్స్ మరియు యూరోపియన్ నిఘా సంస్థల తాజా నివేదికలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. గత ఏడాది ఇదే సమయానికి 17 పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొన్న పుతిన్, ఈ ఏడాది కేవలం రెండు సార్లు మాత్రమే బయటకు రావడం ఆయనలోని భయానికి అద్దం పడుతోందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
పుతిన్‌ను ఇంతలా భయపెడుతున్న ప్రధాన అంశం ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. ముఖ్యంగా రష్యా సరిహద్దుల్లోకి చొరబడి ట్రక్కుల ద్వారా 117 డ్రోన్లను ప్రయోగించి 40కి పైగా రష్యన్ బాంబర్ విమానాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ ప్రతిష్టాత్మక దాడి “ఆపరేషన్ స్పైడర్‌వెబ్” తాలూకు షాక్ నుంచి క్రెమ్లిన్ ఇంకా కోలుకోలేదు. ఇటీవలి కాలంలో ఏకంగా మాస్కో గగనతలంలోకి సైతం ఉక్రెయిన్ డ్రోన్లు చొరబడి క్రెమ్లిన్ కు అత్యంత సమీపంలో దాడులకు పాల్పడటం రష్యా రక్షణ వలయంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. దీనికి తోడు 2026 జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు టార్గెట్ చేయడం వంటి పరిణామాలు పుతిన్‌ను మరింత కలవరపెడుతున్నాయి. తన ప్రైవేట్ నివాసం వద్ద కూడా డ్రోన్ల ద్వారా హత్యాయత్నం జరిగిందన్న వార్తల నేపథ్యంలో.. ఆయన తన దైనందిన కార్యకలాపాలను పూర్తిగా బంకర్లకే పరిమితం చేసి, తన సమయంలొ 70 శాతానికి పైగా కేవలం యుద్ధ వ్యూహాలకే కేటాయిస్తున్నారని సమాచారం.
కేవలం శత్రు దేశం ఉక్రెయిన్ మాత్రమే కాకుండా, రష్యాలోని తన సొంత రాజకీయ, సైనిక ఎలైట్ వర్గాల నుంచే తనకు ముప్పు పొంచి ఉందని పుతిన్ తీవ్రంగా అనుమానిస్తున్నారు. రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరావ్ మాస్కోలో అనుమానాస్పద స్థితిలో మరణించడం, అలాగే రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ అలెగ్జాండర్ బోట్నికోవ్ మరియు జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్ల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు క్రెమ్లిన్‌లో అంతర్గత తిరుగుబాటు భయాలను పెంచుతున్నాయి. సైనిక వైఫల్యాలకు రక్షణ శాఖదే బాధ్యత అని ఒకరు, కాదు ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తరుణంలో.. పుతిన్ తన నీడను కూడా నమ్మలేని స్థితికి చేరుకున్నారు. దేశంలోని పౌర పరిపాలనా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసి, కింది స్థాయి అధికారులను కలవడం కూడా ఆయన మానేశారని రష్యన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ పుతిన్ భద్రతను అత్యంత కఠినతరం చేసింది. ఆయన చుట్టూ ఉండే వంటగాళ్లు, బాడీగార్డ్స్, ఫోటోగ్రాఫర్లు ఎవరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకుండా నిషేధం విధించారు. పుతిన్ ఉన్న పరిసరాల్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పరికరాలను పూర్తిగా బ్యాన్ చేశారు. పైగా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్లను పసిగట్టేందుకు మాస్కో నది వెంబడి భారీగా డాగ్ స్క్వాడ్ (కనైన్ యూనిట్స్) యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను మోహరించారు. తాను బంకర్లలో తలదాచుకున్న విషయం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, రష్యన్ స్టేట్ మీడియా ద్వారా తన పాత వీడియో ఫుటేజీలను ప్రసారం చేయిస్తూ.. తాను ప్రజల మధ్యే ఉంటూ పాలన సాగిస్తున్నాననే ఒక ఫేక్ ఇమేజ్ను క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది.
సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పొరుగు దేశంపై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు, ఇప్పుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుండటం కాలం తెచ్చిన అతి పెద్ద మార్పు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన క్రెమ్లిన్ ఇనుప పాదం.. ఇప్పుడు స్వదేశంలోనే, సొంత మనుషుల మధ్యే అభద్రతతో కుంగిపోతోంది. ఒకవైపు అజేయంగా దూసుకొస్తున్న ఉక్రెయిన్ డ్రోన్లు, మరోవైపు ఎటునుంచి ఏ కుట్ర ముంచుకొస్తుందో తెలియని అంతర్గత రాజకీయ సంక్షోభం.. వెరసి వ్లాదిమిర్ పుతిన్ భవిష్యత్తును అత్యంత ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రెమ్లిన్ కోటలో ఊహించని రాజకీయ భూకంపం రావడం ఖాయమని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








