ప్రభుత్వాల కంటే సమాజమే శక్తివంతం.
* గురుదేవ్ ‘కమలం’ నీడలో దేశం సురక్షితం!
*ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ సందేశం.
*బెంగళూరులో నూతన ‘ధ్యాన మందిరం’ ప్రారంభం.
* పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ విడదీయలేనివని వెల్లడి.
హైదరాబాద్, మహా.
రాజకీయాలు, ప్రభుత్వాల కంటే సమాజమే అత్యంత శక్తివంతమైనదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజ శక్తిని మేల్కొల్పినప్పుడే ఏ ఉద్యమమైనా లేదా ప్రభుత్వ పథకమైనా సంపూర్ణ విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ‘ధ్యాన మందిరం’ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగిస్తూ.. భారతీయ ఆధ్యాత్మిక విలువలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని, ఈ దిశగా శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. 45 ఏళ్ల క్రితం ఒక చిన్న విత్తనంలా మొదలైన ఈ సంస్థ, నేడు కోట్లాది మందికి నీడనిచ్చే మహా వటవృక్షంలా ఎదిగిందని ప్రశంసించారు.
**సమాజమే అసలైన శక్తి.. అభివృద్ధిలో భాగస్వామ్యం అవసరం**
దేశ నిర్మాణంలో ప్రజలు చురుకుగా పాల్గొన్నప్పుడే ఏ ప్రభుత్వమైనా విజయవంతమవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “నేను ఎప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. ప్రభుత్వాల కంటే సమాజం ఎంతో గొప్పది. ఏ ముఖ్యమైన కార్యక్రమానికైనా సామాజిక శక్తిని తోడు చేయడం అత్యవసరం. సమాజాన్ని ఏకం చేయడంలో శ్రీశ్రీ రవిశంకర్ గారు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు” అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని కలిపి ఉంచుతోందని, మన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించడమే భారతీయత మూల సూత్రమని ఆయన వివరించారు. ఇదే క్రమంలో ఆశ్రమ ప్రాంగణంలోని పద్మాకార (కమలం) పైకప్పును ప్రస్తావిస్తూ.. “ఇంకేం జరిగినా మనమందరం గురుదేవుల ఆశీస్సులతో ఈ కమలం నీడలోనే ఉన్నాం. ఈ కమలం దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది” అని ప్రధాని సరదాగా చేసిన వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి.
**డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామి.. యువతే వికసిత్ భారత్ వారధులు**
సాంకేతిక రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. నేడు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందని, స్టార్టప్ వ్యవస్థలోనూ అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు. అంతరిక్షం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు భారత్ అద్భుతమైన ప్రగతిని నమోదు చేస్తోందని, ఈ విజయాల వెనుక దేశ యువశక్తి ఉందని ఆయన కొనియాడారు. అయితే, ప్రపంచంతో అనుసంధానం కావడం ఎంత ముఖ్యమో, యోగా మరియు ధ్యానం ద్వారా మనతో మనం అనుసంధానం కావడం కూడా అంతే అవసరమని ఆయన గుర్తుచేశారు. మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువతే ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని మోదీ ఆకాంక్షించారు.
**పర్యావరణమే ప్రాణం.. రసాయనాల నుంచి భూమాతకు విముక్తి**
పర్యావరణ పరిరక్షణ లేకుండా స్థిరమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని మోదీ హెచ్చరించారు. “ఎకాలజీ (పర్యావరణం), ఎకానమీ (ఆర్థిక వ్యవస్థ) అనేవి విడదీయలేనివి. ఈ రెండూ కలిసుంటేనే సగటు మనిషి జీవనం సాఫీగా సాగుతుంది” అని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమాత అనారోగ్యానికి గురవుతోందని, దానిని కాపాడుకోవడానికి ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని ఆయన సూచించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మరింత చురుగ్గా పాల్గొనాలని కోరారు. అలాగే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ కోసం ఒక మొక్క) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి పర్యావరణాన్ని పచ్చదనంతో నింపాలని ప్రధాని పిలుపునిచ్చారు. మానసిక ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడటం కూడా సేవలో భాగమేనని ఆయన ఉద్ఘాటించారు.








