ఎబోలా కలకలం.
* ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.
* వ్యాక్సిన్ లేని ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్.
* కాంగో, ఉగాండాలో 88కి పైగా ప్రాణాలు బలి.
* డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలతో అప్రమత్తమైన దేశాలు.
* వణికిస్తున్న కొత్త స్ట్రెయిన్, 300కు పైగా కేసులు.
హైదరాబాద్, మహా.
ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి మరోసారి పడగ విప్పింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పొరుగున ఉన్న ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం, పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణమే స్పందించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నాడు ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) గా ప్రకటించింది. వ్యాక్సిన్ లేని ఒక అరుదైన స్ట్రెయిన్ ఇప్పుడు విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ వ్యాప్తి పాండమిక్ స్థాయికి చేరకముందే కట్టడి చేసేందుకు అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.
**డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన**
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిపై అత్యున్నత స్థాయి హెచ్చరిక జారీ చేసింది. కాంగో, ఉగాండా దేశాల్లో వెలుగుచూస్తున్న తాజా ఎబోలా వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. అయితే, ఇది ప్రస్తుతానికి పాండమిక్ (విశ్వమారి) ప్రమాణాలకు చేరలేదని స్పష్టం చేసింది. కాంగోతో భూ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలకు మాత్రం తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
**ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్**
ప్రస్తుతం ఆఫ్రికాలో ప్రబలుతున్న ఎబోలా.. గతంలో అధికంగా కనిపించిన జైర్ స్ట్రెయిన్ కాదు. ఇది అత్యంత అరుదైన, ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట వ్యాక్సిన్లు, చికిత్స విధానాలు అందుబాటులో లేకపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. కాంగో ఆరోగ్యశాఖ మంత్రి శామ్యూల్ రోజర్ కంబా సైతం దీని మరణాల రేటు 50 శాతం వరకు ఉండొచ్చని, వ్యాక్సిన్ లేకపోవడం వల్ల వ్యాప్తి కట్టడి సవాలుగా మారిందని స్పష్టం చేశారు.
**వందల్లో కేసులు.. 88 మందికి పైగా మృతి**
ఆఫ్రికా సీడీసీ గణాంకాల ప్రకారం, కాంగో తూర్పు ప్రాంతమైన ఇటురి ప్రావిన్స్‌లో ఎబోలా కల్లోలం సృష్టిస్తోంది. బునియా, రవాంపరా, మోంగ్‌బ్వాలు వంటి ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం నాటికి 336కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, కనీసం 88 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా నిర్ధారించారు. ల్యాబ్ టెస్టుల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా వస్తుండటంతో, బయటపడని కేసులు ఇంకెన్నో ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
**రాజధానులకు పాకిన మహమ్మారి**
ఈ వైరస్ కేవలం గ్రామీణ లేదా అటవీ, మైనింగ్ ప్రాంతాలకే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి ఉగాండా రాజధాని కంపాలా, కాంగో రాజధాని కిన్షాసా నగరాలకు సైతం వేగంగా వ్యాపించింది. ఇటురి ప్రావిన్స్ నుంచి ప్రయాణించిన వారి ద్వారా ఈ వైరస్ నగరాలకు చేరుతోంది. ఉగాండా రాజధాని కంపాలాలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వైరస్ చేరడం కలకలం రేపుతోంది.
**కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ముప్పు**
పెరి-అర్బన్ మైనింగ్ ప్రాంతాల్లో చురుకైన కమ్యూనిటీ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) జరుగుతోందని ఆఫ్రికా సీడీసీ హెచ్చరించింది. వ్యాప్తిని గుర్తించడంలో నాలుగు వారాల జాప్యం జరగడం, సరైన సమయంలో కాంటాక్ట్ ట్రేసింగ్ జరగకపోవడం, రోగులకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు సైతం ప్రాణాలు కోల్పోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ విధానాల్లో ఉన్న లోపాలు ప్రాణసంకటంగా మారుతున్నాయి.
**పొరుగు దేశాలకు పొంచి ఉన్న ముప్పు**
అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఇప్పటికే వైరస్ వ్యాప్తి చెందిన కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, కాంగో సరిహద్దు దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అన్ని దేశాలు తమ జాతీయ విపత్తు మరియు అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలను తక్షణమే యాక్టివేట్ చేయాలని సూచించింది. సరిహద్దుల వద్ద మరియు ప్రధాన అంతర్గత రవాణా మార్గాల్లో కఠినమైన స్క్రీనింగ్ చేపట్టాలని ఆదేశించింది.
**సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకం**
ఎబోలా గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటనతో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురికావొద్దని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. భయంతో సరిహద్దులను మూసివేయడం లేదా ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేసింది. సరిహద్దులు మూసివేస్తే, ప్రజలు అనధికారిక మార్గాల్లో సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తారని, దీనివల్ల వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేయడం అసాధ్యంగా మారుతుందని హితవు పలికింది. పారదర్శకమైన తనిఖీలే సరైన మార్గమని వెల్లడించింది.








