అమెరికా అధ్యక్షుడికి జరిమానా.
* స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదం.
* నైతిక నిబంధనలు ఉల్లంఘించిన ట్రంప్‌కు ఫైన్.
* అమెరికా అధ్యక్షుడి ‘ప్రయోజనాల సంఘర్షణ’పై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఢిల్లీ, మహా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రమైన ఆర్థిక, నైతిక వివాదంలో చిక్కుకున్నారు. దేశాధినేతగా అత్యున్నత పదవిలో ఉంటూనే స్టాక్ మార్కెట్లో మిలియన్ల డాలర్ల ట్రేడింగ్ చేయడం, ఆ లావాదేవీల వివరాలను సకాలంలో ప్రభుత్వానికి వెల్లడించకపోవడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా లాంటి కంపెనీల షేర్లలో భారీ ఎత్తున క్రయవిక్రయాలు జరపడం, సరిగ్గా ఆయా కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కడానికి ముందే ఈ ట్రేడింగ్ జరగడంతో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ (లోపలి సమాచారంతో ముందే షేర్లు కొనడం) అనుమానాలు బలపడుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ఎథిక్స్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికల ద్వారా ఈ చీకటి లావాదేవీలు వెలుగులోకి రావడం అగ్రరాజ్యంలో సంచలనంగా మారింది.
అమెరికా ప్రభుత్వ నైతిక నియమావళి (ఎథిక్స్ రూల్స్) అత్యంత కఠినంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడు ఎవరైనా సరే, వెయ్యి డాలర్ల ($1,000) కంటే ఎక్కువ విలువైన స్టాక్ కొనుగోళ్లు లేదా అమ్మకాలు జరిపితే, ఆ లావాదేవీ జరిగిన 45 రోజులలోపు అధికారికంగా ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ ఈ రూల్‌ను పాటించడంలో ఉద్దేశపూర్వకంగానే విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. గడువు ముగిసిన తర్వాత వివరాలు ఇచ్చినందుకుగానూ ఎథిక్స్ కమిటీ ఆయనకు 200 డాలర్ల జరిమానా విధించింది. జరిమానా మొత్తం చిన్నదే అయినప్పటికీ, ఒక దేశాధినేత స్థాయిలో ఉండి ఈ ఏడాదిలో ఇలాంటి జరిమానాను ఎదుర్కోవడం ఇది ఏకంగా మూడోసారి కావడం ఆయన నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.
ట్రంప్ ఆర్థిక నివేదికల ప్రకారం.. ఆయన ఫిబ్రవరి నెలలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు చెందిన దాదాపు 5 మిలియన్ల నుంచి 25 మిలియన్ల డాలర్ల విలువైన భారీ షేర్లను విక్రయించారు. ఆ తర్వాత వెంటనే మార్చి నెలలో తిరిగి అదే కంపెనీల్లో మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ విమర్శకులు ప్రధానంగా వేలెత్తి చూపుతున్నది ఈ ‘ట్రేడింగ్ టైమింగ్’ పైనే. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తమ అత్యంత రహస్య కంప్యూటర్ నెట్‌వర్క్‌ల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థల సాంకేతికతను ఉపయోగించుకునేందుకు భారీ ఒప్పందాలను ప్రకటించింది. ఆ ప్రకటనకు కొద్ది నెలల ముందే ట్రంప్ ఈ ట్రేడింగ్ చేయడం గమనార్హం. అలాగే, ఫిబ్రవరి 10న ట్రంప్ ఖాతా ద్వారా ‘ఎన్విడియా’ షేర్లను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా, ఆ తర్వాత కొద్దిరోజులకే మెటా ప్లాట్‌ఫామ్స్‌తో ఎన్విడియా భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. దీంతో ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా 2.5 శాతం పైగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాలు ముందుగానే తెలిసి ఈ ట్రేడింగ్ చేశారా అన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
అమెరికాలో వాటర్‌గేట్ కుంభకోణం తర్వాత ‘ప్రయోజనాల సంఘర్షణ’ రాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. జిమ్మీ కార్టర్ కాలం నుంచి చాలా మంది అధ్యక్షులు తమ పదవీకాలంలో వ్యక్తిగత స్టాక్ పోర్ట్‌ఫోలియోలను అమ్ముకోవడం లేదా వాటిని తాము జోక్యం చేసుకోలేని ‘బ్లైండ్ ట్రస్ట్’ పరిధిలో ఉంచడం ఒక నైతిక సంప్రదాయంగా వస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో (2017) ఈ నిబంధనలు పాటించినప్పటికీ, ప్రస్తుత రెండో పదవీకాలంలో మాత్రం తన షేర్లను అలానే ఉంచుకున్నారు. పైగా ప్రస్తుతం ఈ ఆస్తులను ఆయన పిల్లలు నిర్వహిస్తున్న ఒక ట్రస్ట్ చూసుకుంటోంది. ఇది పాత పద్ధతి లాంటి ‘బ్లైండ్ ట్రస్ట్’ ఏమాత్రం కాదు. దీనివల్ల ట్రంప్‌కు తన పెట్టుబడులు, లావాదేవీల గురించి నిరంతరం తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ నిర్ణయాలను తన ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భారీ వివాదంపై వైట్ హౌస్ నేరుగా స్పందించేందుకు నిరాకరిస్తూ, బంతిని ట్రంప్ ఆర్గనైజేషన్ కోర్టులోకి నెట్టేసింది. ఈ వ్యవహారంపై ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కింబర్లీ బెంజా స్పందిస్తూ.. అధ్యక్షుడి పెట్టుబడులన్నీ థర్డ్ పార్టీ ఆర్థిక సంస్థలే అత్యంత స్వతంత్రంగా నిర్వహిస్తాయని, ఏ షేర్లు కొనాలి, ఏవి అమ్మాలి అనే నిర్ణయాలలో ట్రంప్‌కు కానీ, ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రమేయం లేదా ముందస్తు సమాచారం ఉండదని వివరణ ఇచ్చారు. అయితే ట్రంప్ ఒకవైపు తన ఆర్థిక విధానాల వల్లే అమెరికా స్టాక్ మార్కెట్, నాస్డాక్ రికార్డు స్థాయిలకు చేరుకున్నాయని రోజూ బహిరంగంగా ప్రశంసించుకుంటూ ఉంటారు. ఆ విధానాల ద్వారానే ఆయన వ్యక్తిగత ఖాతాలోకి మిలియన్ల డాలర్లు లాభాల రూపంలో వచ్చి పడుతుండటం విమర్శలకు బలం చేకూరుస్తోంది.








