- మ్యూజియాలు జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలు
- భావితరాలకు భద్రపరచిన అమూల్య వారసత్వ సంపద మ్యూజియం
- అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో మంత్రి జూపల్లి
హైదరాబాద్, మహా : మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా సోమవారం పబ్లిక్ గార్డెన్ లోని రాష్ట్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పరమార జగద్దేవుని శాసనాలు, స్టకో స్కప్చర్స్ ఇన్ సెంటెనరీ మ్యూజియం అనే పుస్తకాలతో పాటు బ్రోషర్లను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మ్యూజియాలు, వారసత్వ సంపద ద్వారానే భావితరాలకు చేరుతాయని అన్నారు.
ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాలను మన పూర్వీకులు నిర్మించారని, వాటిని చూసి తరించక పోతే జీవితం సంపూర్ణం కాదని తెలిపారు.
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని, ఈ వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు, సందర్శకులకు మెరుగైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా గైడ్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రంగాల్లో నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారసత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువత మ్యూజియాలను సందర్శించి చరిత్రపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ మన్యూమెంట్ ఫండ్ బోర్డు మెంబర్ షాలిని భూపాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, కేంద్ర పురావస్తు శాఖ సూపరిన్టెండెంట్ నిఖిల్ దాస్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేద కుమార్, ఇంటాచ్ కన్వీనర్ అనురాధ రెడ్డి, చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








