Mahaa Daily Exclusive

  నాటి నుంచి నేటి వరకు మోదీ నిబద్ధత చెక్కుచెదరలేదు…..

Share

నాటి నుంచి నేటి వరకు మోదీ నిబద్ధత చెక్కుచెదరలేదు.
* ఆయనతో నాటి అమెరికా పర్యటన ఓ మధురానుభూతి.
* వికసిత భారత్ నిర్మాణంలో నేనూ ఒక సమిధను కావడం గర్వకారణం.
* కాలం మారింది.. కానీ దేశం పట్ల ప్రధాని మోదీ దూరదృష్టి మారలేదు.
* భారతీయ జనతా పార్టీ జాతి నాయకులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.

హైదరాబాద్,మే 18.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 32వ అంతర్జాతీయ పురస్కారం దక్కిన వేళ, భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అరుదైన గౌరవం ప్రధానికి దక్కిన సందర్భంగా దశాబ్దాల క్రితం ఆయనతో కలిసి చేసిన పర్యటన జ్ఞాపకాలను పొంగులేటి గుర్తుచేసుకున్నారు. 1993లో నరేంద్ర మోదీతో కలిసి ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా తాను అమెరికా పర్యటనలో పాల్గొన్నానని, ఆ రోజులు తన జీవితంలో అత్యంత గర్వకారణమైనవని ఆయన ఉద్వేగంగా వెల్లడించారు.
ఆ రోజుకు, ఈ రోజుకు మధ్య కేవలం సమయం మాత్రమే మారిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దేశం పట్ల నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన నిబద్ధత, ఆయన ఆలోచనా విధానం, దూరదృష్టి ఏమాత్రం మారలేదని కొనియాడారు. మోదీ ఆశయాలు ఎప్పటికీ దారిచూపే ధ్రువనక్షత్రంలా వెలుగుతూనే ఉంటాయని, ఆ మహోన్నత వ్యక్తిత్వమే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత గౌరవాలు తెచ్చిపెడుతోందని ఆయన ప్రశంసించారు. నాడు తనతో కలిసి ప్రయాణించిన నాయకుడు, నేడు విశ్వగురువుగా ఎదిగి వికసిత భారత్ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయడం ఒక విధేయుడైన కార్యకర్తగా తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.
2040 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే తిరుగులేని మహాశక్తిగా నిలపాలని ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మోదీ చేస్తున్న ఈ మహా యజ్ఞంలో తాను సైతం ఒక సమిధగా పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తన మనోభావాలను పంచుకున్నారు. నరేంద్ర మోదీ తన నాయకుడు అని ప్రపంచానికి గర్వంగా చెబుతానని, దేశ ప్రగతి కోసం ఆయన పడుతున్న తపన, నిరంతర కృషిని చూసి తాను ఎంతో గర్విస్తున్నానని పొంగులేటి ఉద్ఘాటించారు.