- బండి భగీరథ్ పోక్సో కేసు
- మరో సిట్ ఏర్పాటు
- కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
హైదరాబాద్, మహా : సంచలనం రేపిన బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జడ్జిపై అనుచిత, అసత్య పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాయసం దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈ వివాదంతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ఈ సిట్ ను ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, ఆ హైకోర్టు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబార్చేలా సాగిన ఈ ప్రచారంపై ఈ నెల 16న హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చార్మినార్ పీఎస్ నుండి ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో ఉన్న కుట్ర కోణాలను, ఇతర నిందితుల పాత్రను పూర్తిగా బయటపెట్టేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలోని ‘సిట్’ రంగంలోకి దిగారు.
భగీరథ్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును సిట్ బృందం ముమ్మరం చేసింది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలను సేకరించేందుకు నిందితుడు బండి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా విచారించాల్సి ఉన్నందున, భగీరథ్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కోర్టు అనుమతి లభిస్తే నిందితుడిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించనున్నారు.
భగీరథ్ స్నేహితుల్ని విచారించిన పోలీసులు
బండి భగీరథ్ స్నేహితులను పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోలీసులు సోమవారం విచారించారు. ఆ ఘటన జరిగిన రోజు అసలేం జరిగింది, ఎంత మంది ఉన్నారు, ఎందుకు కలిశారు అనే విషయాలపై ఆరా తీశారు. విచారణలో భాగంగా పోలీసులు వారి స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. నిందితుడు బండి భగీరథ్‌పై పోలీసులు మరింత కఠినమైన బీఎన్ఎస్ సెక్షన్‌ను చేర్చారు. ఒకరిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఉండటంతో పోలీసులు ఈ కొత్త సెక్షన్‌ను నమోదు చేశారు. బండి భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహితలోని 64(2)(ఎం) సెక్షన్‌ను పోలీసులు అదనంగా చేర్చారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఈ సెక్షన్‌ను చేర్చడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త సెక్షన్ ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథ్‌కు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.








