- నిప్పుల కొలిమిలా తెలంగాణ
- 13 జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఎండలకు నలుగురు బలి
- బయటకు రావద్దని హెచ్చరికలు జారీ
- జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు చేసింది.
అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ
రాష్ట్రంలో బుధవారం నాటి వాతావరణ గణాంకాలు భయం గొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి 45.9 డిగ్రీలకు చేరుకోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మార్కును దాటేశాయి. హైదరాబాద్‌లో వేడి తీవ్రం 43 డిగ్రీలుగా నమోదు అయ్యింది.
ఎండలకు నలుగురు బలి
తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం వడ దెబ్బకు గురైన నలుగురు వ్యక్తులు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాచర్ల రాజు అనే రైతు మరణించాడు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారానికి చెందిన శామ్యూల్ అనే కార్మికుడు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన లచ్చు అనే వృద్ధురాలు, శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ వడదెబ్బకు ప్రాణాలు వదిలేశారు. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడం ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 50 శాతం లోపు మాత్రమే ఉంటోంది. సాధారణంగా రాత్రివేళల్లో వచ్చే చల్లని గాలులు కూడా ఇప్పుడు వీయకపోవడం వల్ల రాత్రిపూట కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది.
రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవే
రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు హెచ్చరించారు. ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. భారీగా వీచిన గాలులు కారణంగా చెట్లు విరిగిపడం, ఇళ్ల రేకులు ఎగిరిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది. రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు.








