- సీఎంగా రఘునందన్ రావు
- పోసాని సినిమాలో నటించిన బీజేపీ ఎంపీ
- ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాలో వకీల్ సాబ్
- వెల్లడించిన నయుడు, డైరెక్టర్ పోసాని కృష్ణమురళి
హైదరాబాద్, మహా : రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమ్ డైరెక్టర్ పోసాని కృష్ణమురళి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో కొత్తగా సినిమా తీశారు.. ఈ మూవీలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా నటించారని పోసాని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. తన సినిమాలో ఎంపీ రఘునందనరావు ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేశారని, ఆయన ఫేస్‌లో మంచి ఇంప్రెషన్ ఉందని గుర్తించి క్యారెక్టర్ చేయమని అడిగానన్నారు. రఘునందన్ రావు అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనకు తానంటే ఎంతో అభిమానం ఉందన్నారు. ఈ సినిమాలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. తానే వచ్చి కథ చెబుతానంటే వద్దని చెప్పి రఘునందనరావు తన ఇంటికి వచ్చినట్లు పోసాని చెప్పారు. తన ఇంటికి వచ్చిన రఘునందనరావుకు కథ చెప్పానని, సినిమా బావుందని చెప్పి ముఖ్యమంత్రి క్యారెక్ట్ చేశారన్నారు. రఘునందన్ రావు బాగా చదువుకున్నారు, మంచి నాలెజ్డ్ ఉన్న వ్యక్తి, సినిమాలో కూడా బాగా చేశారన్నారు. తాను షూటింగ్ సమయంలో క్యారెక్టర్ ఓన్ చేసుకోమని మాత్రమే చెప్పానన్నారు. తన కథ గురించి చెప్పి ఆయన్ను నటించేందుకు ఒప్పించానన్నారు. ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి పాత్రలో ఒక నిజాయితీ గల జర్నలిస్టుకు అండగా నిలుస్తారన్నారు.
సినిమాల నుంచి గ్యాప్ తీసుకోలేదు
తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోలేదని, అవకాశం దొరికితే దర్శకత్వంతో పాటుగా మంచి క్యారెక్టర్ ఉంటే నటిస్తానని పోసాని అన్నారు. రాజమౌళి సినిమా, సినిమాకు గ్యాప్ ఇస్తారని.. అలాగని ఇండస్ట్రీకి దూరమైనట్లు కాదుగా అన్నారు. తన ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ సినిమా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, ఎవరైనా చక్కగా చూడొచ్చన్నారు. ప్రజలు నేతల్ని ఎన్నుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశామన్నారు. తనకు ఉన్న అనుభవంతో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించినట్లు తెలిపారు. ఈ సినిమా ద్వారా జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం ఎంత బావుంటుందో చెప్పే ప్రయత్నం చేశానన్నారు.








