ఎబోలా కలకలం.. దేశంలో హైఅలర్ట్.
* ఆఫ్రికా ప్రయాణికులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు.
* ఎబోలా ఎఫెక్ట్తో భారత్-ఆఫ్రికా సదస్సు వాయిదా.
* గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ.
* విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు.
ఢిల్లీ, మహా.
ప్రపంచాన్ని మరోసారి భయం గుప్పిట్లోకి నెడుతూ ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి కానప్పటికీ, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ హెచ్చరించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో కేంద్రం నిఘా పెంచింది.
**ప్రయాణికులు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు**
ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ తదితర ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్‌కు చేరుకునే ప్రయాణికుల పట్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం ఆదేశించింది. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని విమానాశ్రయాల్లోని ఆరోగ్య అధికారులకు తప్పనిసరిగా వెల్లడించాలి. ఎవరైనా ప్రయాణికులు ఎబోలా నిర్ధారిత రోగుల రక్తం లేదా ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించాలి. తీవ్రమైన జ్వరం, నీరసం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు, అనూహ్య రక్తస్రావం లాంటి లక్షణాలు ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించాలి. భారత్‌కు వచ్చిన 21 రోజుల లోపు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి తమ గత ప్రయాణ చరిత్రను కచ్చితంగా తెలియజేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
**రాష్ట్రాలకు ముందస్తు మార్గదర్శకాలు**
కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, అయినప్పటికీ ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ స్పష్టం చేశారు. అనుమానిత రోగుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. నమూనాల సేకరణ, ల్యాబ్ పరీక్షలు, రోగులకు అందించాల్సిన తక్షణ చికిత్స తదితర అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పంపించారు.
**తాత్కాలికంగా వాయిదా పడిన భారత్-ఆఫ్రికా సదస్సు**
ఎబోలా వైరస్ తీవ్రత దౌత్య సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది. ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన 4వ భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సును భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండం నుంచి పెద్ద ఎత్తున దేశాధినేతలు హాజరుకావాల్సి ఉంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ సదస్సును వాయిదా వేశామని, అయితే ఎబోలాపై పోరాటంలో ఆఫ్రికా దేశాలకు అండగా నిలిచి వైద్య సహాయం అందిస్తామని భారత్ భరోసా ఇచ్చింది.
**కాంగోలో మృత్యుఘంటికలు.. డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆందోళన**
తాజా నివేదికల ప్రకారం కాంగోలో ఎబోలా మహమ్మారి బారిన పడి ఇప్పటికే 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడటం పొరుగు దేశాలను కలవరపెడుతోంది. 1976లో తొలిసారిగా కాంగోలో ఈ వైరస్‌ను గుర్తించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది వ్యాప్తి చెందడం ఇది 17వ సారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వైరస్‌ను సమూలంగా అంతం చేసేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడం వల్లే దీనిని అరికట్టడం అత్యంత సవాలుగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైరస్ లక్షణాలు ఉన్నవారు విదేశీ ప్రయాణాలు చేయవద్దని సూచించిన డబ్ల్యూహెచ్‌ఓ.. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు మాత్రం విధించవద్దని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది.








