- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపి జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య.
సంగారెడ్డి,మహా.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక దారుణ హత్యోదంతం వెలుగుచూసింది. తన మోహానికి, ప్రియుడితో బంధానికి అడ్డుగా ఉన్నాడనే క్రూరమైన ఆలోచనతో ఒక మహిళ, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా అంతమొందించింది. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జేసీబీ వాహనం సహాయంతో ఏకంగా పెద్ద గొయ్యి తీయించి శవాన్ని అందులో పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన భార్యాభర్తలు. అయితే గత కొంతకాలంగా కల్పనకు చింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త ముత్యంరెడ్డికి తెలియడంతో ఇంట్లో దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.
తమ బంధానికి ముత్యంరెడ్డి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని కల్పన, ఆమె ప్రియుడు చింటూ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దొరికిన సమయం చూసి ముత్యంరెడ్డిని ఇరువురు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం హత్యా ఉదంతాన్ని దాచిపెట్టేందుకు, ఒక నిర్మానుష్య ప్రాంతంలో రాత్రికి రాత్రే జేసీబీ వాహనాన్ని రప్పించి పెద్ద గొయ్యి తవ్వించారు. ముత్యంరెడ్డి మృతదేహాన్ని అందులో వేసి మట్టితో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చారు. నేరాన్ని పక్కదారి పట్టించేందుకు భార్య కల్పన స్వయంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన భర్త గత తొమ్మిది రోజులుగా కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముత్యంరెడ్డి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణ ప్రక్రియలో భార్య కల్పన ప్రవర్తన, ఆమె పొంతన లేని సమాధానాలపై పోలీసులకు తీవ్ర అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫోన్ కాల్ డేటాను, కదలికలను నిశితంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడు చింటూతో కలిసి తానే భర్తను చంపేసి, జేసీబీతో గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితులు చూపించిన సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నరరూప రాక్షసత్వంపై కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు వెల్లడించారు.







