కాకినాడ పెట్టుబడుల సదస్సు సక్సెస్.
* రూ.4,256 కోట్లతో ఎంవోయూలు.
* గోదావరి జిల్లాల పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ముగిసిన రెండో ప్రాంతీయ సదస్సు.
* రూ.2,195 కోట్ల విలువైన 35 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
* ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
కాకినాడ, మహా.
గోదావరి జిల్లాల సమగ్ర పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా కాకినాడ జేఎన్టీయూ వేదికగా నిర్వహించిన రెండో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. స్థిరమైన ఇంధనం, నౌకానిర్మాణం, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఆతిథ్య రంగాలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు విశేషంగా పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో మొత్తం రూ.4,256.61 కోట్ల భారీ పెట్టుబడులకు సంబంధించి 15 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 14,261 మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇదే వేదికపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సదస్సు ముఖ్య అతిథి కొణిదెల పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల సమక్షంలో రూ.2,195.33 కోట్ల విలువైన మరో 35 పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. వీటి ద్వారా అదనంగా 4,039 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ సదస్సులో మంత్రులు కందుల దుర్గేశ్, టి.జి. భరత్, బి.సి. జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పోలవరం జిల్లాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించింది. గోదావరి బేసిన్లో ఇప్పటికే ఎరువులు, సహజవాయువు పరిశ్రమలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హరిత అమ్మోనియా, పర్యావరణహిత ఇంధనాల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సదస్సులో సేఫ్ వన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.1,835 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సుస్థిర విమాన ఇంధన తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే 2,500 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడను హరిత ఇంధన కేంద్రంగా మలిచే ప్రణాళికల్లో భాగంగా.. రూ.91,000 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉండగా, రూ.83,000 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇప్పటికే లాంఛనంగా ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన నూతన పర్యాటక విధానం 2024–29 కింద గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి ఈ సదస్సులో ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రూ.698.61 కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 5,885 ఉద్యోగాలు రానున్నాయి. రాజమహేంద్రవరంలో రూ.101.28 కోట్లతో భారీ పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, కాకినాడలో రూ.54.10 కోట్లతో నిర్మించిన నూతన హోటల్‌ను ప్రారంభించారు. మరోవైపు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, నాలుగో దశ ఎంఎస్ఎంఈ పార్కుల పనులకు ఇక్కడే శ్రీకారం చుట్టారు. రూ.161 కోట్ల వ్యయంతో 15 నియోజకవర్గాల్లో ఎనిమిది అంతస్తుల కర్మాగార సముదాయాలు, పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు, జీడిపప్పు శుద్ధి తదితర ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి ఇప్పటికే 1,008 కేటాయింపులు పూర్తి కాగా, పది మంది స్థానిక పారిశ్రామికవేత్తలకు తాత్కాలిక కేటాయింపు పత్రాలను సదస్సులో అందజేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ సదస్సుల వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటివరకు విశాఖపట్నంలో జరిగిన తొలి సదస్సు, తాజాగా కాకినాడలో ముగిసిన రెండో సదస్సు ద్వారా మొత్తం రూ.25,754.61 కోట్ల భారీ పెట్టుబడులకు సంబంధించిన 46 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా ఏకంగా 71,206 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాంతీయ సదస్సుల విజయాల స్ఫూర్తితో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆతిథ్యంలో నవంబరు 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా 31వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ప్రతిపాదనలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వాస్తవరూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.








