Mahaa Daily Exclusive

  గంగాదేవిగుట్టను కాపాడండి…

Share

  • గంగాదేవిగుట్టను కాపాడండి
  • తహసీల్ధార్ కు గుట్టకిందిగుంపు వాసుల వినతి

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం, గుట్టకిందగుంపు గ్రామపంచాయతీ పరిధిలోని గంగాదేవిగుట్టను గోదాం నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తున్నారని గుట్టను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎస్సై బైరు గోపి లకు వినతిపత్రం అందజేశారు. గంగాదేవిగుట్ట పై గోదాం నిర్మాణం పేరుతో గుత్తేదారు విచ్చలవిడిగా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపట్టి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్థులు మట్టి త్రవ్వకాలను అడ్డుకుంటున్నప్పటికి, మళ్లీ మళ్లీ త్రవ్వకాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గంగాదేవిగుట్ట వద్ద తమ ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా ఉన్న కాళికాదేవి విగ్రహం, సమ్మక్క గద్దెలు, గంగాదేవి విగ్రహాలకు ఉన్నాయని వాటికి ఆధారమైన మట్టిని తొలగించడం వల్ల అవి కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులమైన తమ మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వారు హెచ్చరించారు.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అక్రమ మట్టి త్రవ్వకాలను నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గుట్టపై త్రవ్వకాలు ఆపకపోతే అఖిలపక్షాల సాయంతో పోరాటాన్ని ఉదృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, లక్ష్మినర్సు, తొగర శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.