Mahaa Daily Exclusive

  గోదావరి పుష్కరాల పనులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం…

Share

గోదావరి పుష్కరాల పనులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.
• ఇంకా డీపీఆర్‌లు సిద్ధం కాలేదా?.
• ఒకే ఏడాదిలో హడావుడిగా పనులు చేస్తే ఒప్పుకోను.
• తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకూడదు.
• గోదావరి పుష్కరాల సమీక్షలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
రాజమండ్రి,మహా.
రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధత సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటివరకు సరైన సన్నద్ధత కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం సుమారు రూ. 8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డీపీఆర్‌లు (వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు) సిద్ధం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాగితాలపై ప్రణాళికలు చూపించడం కాకుండా, క్షేత్ర స్థాయిలో పనులు కనిపించాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరించాలని అధికారులను ఆదేశించారు.
**హడావుడిగా పనులు చేస్తే నాణ్యత దెబ్బతింటుంది..**
సరైన ప్రణాళిక లేకుండా ఒకే ఏడాదిలో 7 వేల పనులు హడావుడిగా చేస్తే నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. “పాడైపోయిన సిమెంట్‌తో పనులు చేసి ప్రమాదాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. స్పష్టమైన డేటా లేకుండా అడిగితే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వదు” అని తేల్చిచెప్పారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు.
**కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్**
గత పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట వంటి దురదృష్టకర ఘటనలు ఈసారి పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. పుష్కరాల ఏర్పాట్లను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు విస్తరించాలని ఆదేశించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ పుష్కరాల సన్నద్ధత అంశాన్ని త్వరలోనే రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ఆశాకిరణంలా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.