Mahaa Daily Exclusive

  ఏఐ లాభాల పంట….

Share

ఏఐ లాభాల పంట.
* ఉద్యోగులకు శాంసంగ్ భారీ బోనస్.
* చిప్ విభాగంలోని 78 వేల మందికి ఒక్కొక్కరికి సగటున రూ.3.25 కోట్లు.
* యాజమాన్యంతో కుదిరిన ఒప్పందానికి కార్మిక సంఘం గ్రీన్ సిగ్నల్.
* 95 శాతం మంది ఓటింగ్‌తో ముగిసిన సంక్షోభం.. తప్పిన సమ్మె ముప్పు.
సియోల్,మహా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న టెక్నాలజీ విప్లవం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ ఉద్యోగుల పాలిట కామధేనువుగా మారింది. ఏఐ రంగంలో నెలకొన్న అనూహ్యమైన వృద్ధి కారణంగా కంపెనీకి చెందిన చిప్ విభాగం భారీగా లాభాల పంట పండించింది. దీంతో ఆ అసాధారణ లాభాల ఫలాలను నేరుగా తమ ఉద్యోగులకే పంచాలని శాంసంగ్ యాజమాన్యం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెమీకండక్టర్, చిప్ డివిజన్‌లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.25 కోట్లు) బోనస్‌గా అందజేయనుంది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యానికి, కార్మిక సంఘానికి మధ్య కుదిరిన చారిత్రక వేతన ఒప్పందానికి ఉద్యోగుల నుంచి భారీ మెజారిటీతో ఆమోదం లభించింది.
**ఉత్కంఠకు తెర.. సమ్మె ముప్పు నుంచి ఉపశమనం**
బోనస్ ప్యాకేజీపై కంపెనీకి చెందిన అతిపెద్ద కార్మిక సంఘం నిర్వహించిన అంతర్గత ఓటింగ్‌లో ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అర్హులైన సభ్యుల్లో ఏకంగా 95 శాతానికి పైగా ఉద్యోగులు ఈ ఓటింగ్‌లో పాల్గొనగా, వారిలో 73.7 శాతం మంది యాజమాన్యం ప్రతిపాదించిన ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సానుకూల నిర్ణయంతో గత కొన్ని రోజులుగా కంపెనీని వేధిస్తున్న దాదాపు 18 రోజుల సుదీర్ఘ సమ్మె ముప్పు తృటిలో తప్పింది. ఒకవేళ ఈ సమ్మె గనుక జరిగి ఉంటే శాంసంగ్ అంతర్గత ఉత్పత్తి దెబ్బతినడమే కాకుండా, అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడి ప్రపంచ సరఫరా వ్యవస్థ (గ్లోబల్ సప్లై చైన్) తీవ్ర అంతరాయానికి గురై ఉండేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
**49 రెట్లు పెరిగిన ఆదాయం.. 10.5 శాతం షేర్ల రూపంలో..**
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల నిర్వహణ కోసం హై-ఎండ్ మెమరీ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్లోబల్ మార్కెట్లో మెమరీ చిప్ తయారీలో అగ్రగామిగా ఉన్న శాంసంగ్ ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకుంది. దీని ఫలితంగానే గడిచిన త్రైమాసికంలో కంపెనీ చిప్ విభాగం ఆదాయం కళ్లు చెదిరే రీతిలో ఏకంగా 49 రెట్లు వృద్ధి చెందింది. ఈ అద్భుత ప్రగతి నేపథ్యంలోనే తమకూ లాభాల్లో వాటా ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అయితే ఈ భారీ బోనస్ ప్యాకేజీ శాంసంగ్ గ్రూపులోని ఉద్యోగులందరికీ కాకుండా.. కేవలం ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లను రాత్రింబవళ్లు తయారు చేసే సెమీకండక్టర్ విభాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ విభాగంలో ప్రస్తుతం సుమారు 78,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
నూతన ఒప్పందం ప్రకారం, సెమీకండక్టర్ విభాగం సాధించిన మొత్తం ఆపరేటింగ్ ప్రాఫిట్ (నిర్వహణ లాభం) నుంచి 10.5 శాతాన్ని ఉద్యోగులకు కంపెనీ షేర్ల రూపంలోనూ, మరో 1.5 శాతాన్ని నేరుగా నగదు రూపంలోనూ చెల్లిస్తారు. ఈ మెగా బోనస్ చెల్లింపుల కోసం శాంసంగ్ యాజమాన్యం ఏకంగా 26.5 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించనుందని అంచనా. కాగా, ఇటీవలే తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ తర్వాత ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన రెండో ఆసియా కంపెనీగా శాంసంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏఐ బూమ్ కారణంగా శాంసంగ్‌తో పాటు మరో ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ ‘ఎస్‌కే హైనిక్స్’ కూడా గత ఏడాది తమ ఉద్యోగులకు ఇదే తరహాలో భారీ బోనస్‌లు ప్రకటించి వార్తల్లో నిలిచింది.