దీదీకి బిగ్ షాక్.
*టీఎంసీకి బరాసత్ ఎంపీ కకోలి ఘోష్ గుడ్‌బై.
**నాలుగు దశాబ్దాల బంధానికి కట్టిఫ్.
* ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా.
* పార్టీలో మహిళలకు దక్కని గౌరవంపై బహిరంగ ఆవేదన.
ఢిల్లీ, మహా.
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకురాలు, బరాసత్ లోక్‌సభ సభ్యురాలు కకోలి ఘోష్ దస్తికార్ పార్టీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీలోని తన అన్ని కీలక పదవులకు ఆమె ఒక్కసారిగా రాజీనామా చేశారు. బరాసత్ నియోజకవర్గం నుంచి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా గెలుపొంది, ఆ ప్రాంతంలో తనకంటూ తిరుగులేని పట్టు సాధించిన కకోలి తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలమే రేపుతోంది. ఇటీవలే ఆమె టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆ వేడి చల్లారకముందే ఇప్పుడు ఏకంగా పార్టీకే గుడ్‌బై చెప్పడం గమనార్హం.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఒక కీలక పరిపాలనా సమావేశం ఈ రాజీనామాకు తక్షణ కారణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన అత్యంత కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్‌కు హాజరైన కకోలి ఘోష్.. ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన రాజీనామా నిర్ణయాన్ని బయటపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అఖిల భారత తృణమూల్ మహిళా కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ లాంటి అత్యున్నత బాధ్యతలతో పాటు, పార్టీలోని ఇతర సంస్థాగత కమిటీలు, పదవుల నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఆమె కుండబద్దలు కొట్టారు. దశాబ్దాలుగా నమ్ముకున్న సొంత గూటిని ఇలా అర్ధాంతరంగా వీడటం తనకెంతో బాధాకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీని వీడటానికి గల ప్రధాన కారణాన్ని కూడా కకోలి ఘోష్ దస్తికార్ ఎంతో నిర్మొహమాటంగా బయటపెట్టారు. సొంత పార్టీకే చెందిన ఒక ఎంపీ.. తోటి మహిళా ఎంపీ పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించినా పార్టీ అధిష్టానం కనీసం స్పందించకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు కనీస గౌరవం, రక్షణ లేని చోట, తప్పు చేసిన వారిని ప్రశ్నించలేని పార్టీలో తానెందుకు కొనసాగాలని ఆమె సూటిగా ప్రశ్నించారు. “నాకు మమతా బెనర్జీ గారితో 1976 నుంచి పరిచయం ఉంది. 1984 నుంచి ఆమెతో కలిసి అడుగడుగునా నడిచాను. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నేను చూపించిన విధేయతకు, పార్టీ కోసం నేను పడ్డ కష్టానికి నాకు లభించిన బహుమతి ఇదా?” అంటూ కకోలి ఘోష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.








