Mahaa Daily Exclusive

  భార్యాభర్తల గొడవల్లో అత్తమామల మౌనం నేరం కాదు!

Share

భార్యాభర్తల గొడవల్లో అత్తమామల మౌనం నేరం కాదు!
*నైతికంగా అది తప్పైనా.. క్రిమినల్ కేసు కిందకు రాదన్న సుప్రీంకోర్టు.
* గుడ్డిగా భర్త కుటుంబం మొత్తాన్ని కేసుల్లో ఇరికించడం సరికాదని తీవ్ర వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉన్నంత మాత్రాన వారిపై వరకట్న వేధింపుల కేసులు బనాయించడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కళ్లెదుటే గొడవ జరుగుతున్నా పట్టించుకోకపోవడం నైతికంగా తప్పు కావచ్చు కానీ, చట్టం దృష్టిలో దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వివాదాలొచ్చిన ప్రతిసారీ భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా కేసుల్లోకి లాగడం సరికాదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
**ఆధారాలు ఉంటేనే చర్యలు**
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు అత్తమామలు కొడుకుకు (భర్తకు) మద్దతు ఇచ్చారనో, గొడవల్లో జోక్యం చేసుకోకుండా మిన్నకున్నారనో, లేదా సంసారం అన్నాక సర్దుకుపోవాలని సలహా ఇచ్చారనో చెప్పి.. వారిపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించడం ఎంతమాత్రం సబబు కాదని కోర్టు స్పష్టం చేసింది. నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటే తప్ప, కేవలం సాధారణ ఆరోపణలతో అత్తమామలను దోషులుగా నిలబెట్టలేమని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది.
**మధ్యప్రదేశ్ కేసు కొట్టివేత**
మధ్యప్రదేశ్‌లోని గుణా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు అత్తమామలపై పెట్టిన వరకట్న వేధింపుల కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా ఆ కేసును కొట్టివేసింది. సదరు మహిళ తన అత్తమామలపై ఎలాంటి నిర్దిష్టమైన, బలమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది. వివాహ బంధం విఫలమైనప్పుడు ఒక మహిళ పడే మానసిక వేదనను తాము తక్కువ చేసి చూడలేమని చెబుతూనే.. ఇలాంటి వైవాహిక వివాదాల కేసులను విచారించేటప్పుడు కింది కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి ఆరోపణను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించింది.
**కక్ష సాధింపులకు ఇది వేదిక కాదు..**
వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు, పగ, వ్యక్తిగత కక్షలు దాగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సున్నితమైన సమయాల్లో కేవలం భర్తపైనే కాకుండా, ఆ గొడవలతో ఏమాత్రం సంబంధం లేని అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులందరినీ వరకట్న వేధింపుల కేసుల్లో ఇరికించే ధోరణి ఈమధ్య ఎక్కువగా కనిపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులుగా చేర్చిన వారు నిజంగానే క్రూరత్వానికి పాల్పడ్డారా? లేదా అదనపు కట్నం కోసం ఏమైనా వేధించారా? అనేదానికి పక్కా ఆధారాలు ఉండటం చట్టప్రకారం ఎంతో ముఖ్యమని కోర్టు తేల్చిచెప్పింది. ఆధారాలు లేకుండా కేవలం మాటలతో అందరినీ ముద్దాయిలుగా నిలబెట్టలేమని స్పష్టం చేసింది.