Mahaa Daily Exclusive

  ప్రాణమైనా ఇస్తాం.. కానీ గళం ఆపే ప్రసక్తే లేదు….

Share

ప్రాణమైనా ఇస్తాం.. కానీ గళం ఆపే ప్రసక్తే లేదు.
• పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ ఛాలెంజ్.
• ‘టైమ్, ప్లేస్ చెప్పండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి’.
• హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
ఏపీ పోలీసులు తనపై హైదరాబాద్‌లో కేసులు నమోదు చేయడం, దానికి పవన్ కళ్యాణ్ వ్యవహారమే కారణమంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. తనపై కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదని, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ వాస్తవాలు మాట్లాడే హక్కును మాత్రం ఏమాత్రం వదులుకోనని ఆయన కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సర్కారుకు నేరుగా సవాల్ విసిరారు. తనను అరెస్ట్ చేస్తారా లేక కేసులు ఉపసంహరించుకుంటారా అన్నది వాళ్ల ఇష్టమని, కానీ తాను మాత్రం ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. “కావాలంటే టైమ్, ప్లేస్ మీరే చెప్పండి.. నేనే స్వయంగా వస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి” అంటూ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తనపై లేనిపోని సెక్షన్లన్నీ పెట్టి తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని నాగేశ్వర్ మండిపడ్డారు. తాను పిరికివాడిని కాదని, ముప్పై ఏళ్ల వయసులోనే ఎన్నో బెదిరింపులను, సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన తాను.. ఈ అరవై రెండేళ్ల వయసులో ఇలాంటి ఉడత ఊపులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమాజంలో రెండు కులాల మధ్య, ప్రాంతాల మధ్య తాను కావాలనే చిచ్చుపెడుతున్నానని, అల్లర్లు రేపేందుకు ప్రయత్నిస్తున్నానని తనపై కట్టుకథలు అల్లి కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాను నిజంగానే సమాజంలో నిప్పు పెట్టి ఉంటే.. ఈ పది రోజుల్లో ఏ ఊళ్లో అల్లర్లు జరిగాయని ఆయన ప్రశ్నించారు. “కనీసం రెండు దోమలు, నాలుగు ఈగలను కూడా ఎవరూ చంపలేదు, నాలుగు వీధి కుక్కలు కూడా కొట్లాడుకోలేదే” అంటూ సర్కారు మోపిన అభియోగాలను తీవ్రంగా ఎద్దేవా చేశారు.
> **”అమెరికా గురించి, ఇరాన్ గురించి కూడా నేను విశ్లేషిస్తాను.. అంతమాత్రాన నేను ఆ దేశ పౌరుడిని కావాలా? నేను ఎక్కడున్నా ప్రజల పక్షాన నా గొంతుకను వినిపిస్తూనే ఉంటా.”**
>
అసలు తన మాటల్లో ఎక్కడైనా కులాల ప్రస్తావన ఉందా అని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా నిలదీశారు. ప్రాంతాలు, కులాల పేరుతో పబ్బం గడుపుకుంటున్నది ఆ రెండు పార్టీలేనని విమర్శించారు. “నువ్వు తెలంగాణ వాడివి కదా.. ఏపీ రాజకీయాల గురించి నీకెందుకు?” అని అడుగుతున్న వారికి ఆయన దిమ్మతిరిగే జవాబిచ్చారు. తాను ఒక రాజకీయ విశ్లేషకుడినని, అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో జరిగే రాజకీయాలపైనా మాట్లాడుతానని.. విశ్లేషణ చేయడానికి ఆయా ప్రాంతాలకు చెందిన వాడై ఉండాల్సిన అవసరం లేదని చురకలంటించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా అరెస్ట్ చేయాలని చూసినా భయపడే రకం తాను కాదని, ఏది ఏమైనా నిజాయితీగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంటానని ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి స్పష్టం చేశారు. తన గళాన్ని నొక్కేయాలని చూసే ప్రయత్నాలు ఎన్నటికీ సాగవని ఆయన పత్రికాముఖంగా తేల్చిచెప్పారు.