జూన్ 2 తర్వాత ‘భూ’ భారం.
* రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సర్వం సిద్ధం.
* హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా బాదుడు.
* లక్షకు పైగా ప్రాంతాల్లో మారనున్న మార్కెట్ విలువలు.
* సబ్రిజిస్ట్రార్ల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి.
* ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఎప్పుడైనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల, స్థలాల కొనుగోలు వ్యవహారం సామాన్యులకు మరింత ప్రియం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ పెంచిన ధరలను అధికారికంగా అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే కొత్తగా సవరించిన భూముల విలువలకు సంబంధించి ఆయా మార్కెట్ రివిజన్ కమిటీల సంతకాలతో కూడిన అప్‌లోడ్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు విజయవంతంగా పూర్తి చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల అమలుకు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమే ఇక తరువాయి. ఈ తాజా ధరల పెంపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ప్రాంతాల్లో తీవ్రంగా పడుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
గత నాలుగేళ్లుగా స్థిరాస్తి రంగంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు, పెరిగిన బహిరంగ మార్కెట్ ధరలను బేరీజు వేసుకుని ప్రభుత్వం ఈ కీలక సవరణలు చేపట్టింది. ప్రముఖ ఆర్థికవేత్త, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సలహాలు, సూచనలతో ఈ మార్కెట్ విలువల పెంపు పక్రియను పకడ్బందీగా చేపట్టారు. ఈ రేట్ల సవరణలో ప్రధానంగా నాలుగు స్లాబులను నిర్ధారించినట్లు తెలుస్తోంది. గత రెండు మూడేళ్లలో ఉన్నఫలంగా అభివృద్ధి చెంది, బహిరంగ మార్కెట్ విలువలు అమాంతం పెరిగిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను ఏకంగా వంద శాతం మేర పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఓపెన్ మార్కెట్ పరిస్థితిని బట్టి తక్కువలో తక్కువ 25 శాతం, ఆ తర్వాత 50 శాతం, 75 శాతం మేర స్లాబుల్లో రేట్లను పెంచారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలన్నింటికీ ఈ నాలుగు స్లాబుల విధానాన్ని వర్తింపజేయనున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనేవారిపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తుల బహిరంగ మార్కెట్ విపరీతంగా పెరగడంతో, దానికి తగ్గట్లుగా అక్కడ రిజిస్ట్రేషన్ విలువలను భారీగా సవరించారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ సవరణలు జరగ్గా.. ఒక్క మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనే 8 వేలకు పైగా ప్రాంతాల్లో రేట్ల మార్పులు చోటుచేసుకున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు వేగంగా నగరీకరణ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోనూ ఈ ధరల పెంపు సెగ గట్టిగానే తగలనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలను.. పట్టణ ప్రాంతాల్లోని వార్డులు, డివిజన్లను ప్రామాణికంగా తీసుకుని, వాణిజ్య ప్రాంతాలు, జాతీయ-రాష్ట్ర రహదారులను ప్రత్యేక యూనిట్లుగా పరిగణించి ఈ రేట్లను సగటున నిర్ధారించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను ఈ స్థాయిలో పెంచడం ఇది మూడోసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021, 2022 సంవత్సరాల్లో రెండు సార్లు ఈ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. ఆ తర్వాత డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న యోచనలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను సుదీర్ఘంగా అధ్యయనం చేయించింది. మార్కెట్ ధరల పెంపునకు రెండుసార్లు కసరత్తు చేసినప్పటికీ వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పక్కా ప్రణాళికతో ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రంలో ఈ కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది.








