Mahaa Daily Exclusive

  కేరళలో ఈడీ ప్రకంపనలు….

Share

కేరళలో ఈడీ ప్రకంపనలు.
* మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో సోదాలు.
* భగ్గుమన్న సీపీఎం శ్రేణులు.
* కుమార్తె వీణ ‘ఎక్సాలాజిక్’ సంస్థకు అక్రమంగా రూ.1.72 కోట్లు ముట్టాయన్న ఆరోపణలు.
* రంగంలోకి ఈడీ.. రాష్ట్రవ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో దాడులు.
* ఈడీ అధికారుల వాహనాలపై దాడి చేసిన సీపీఎం కార్యకర్తలు.
* ఇదంతా కేంద్రం రాజకీయ కుట్రేనన్న సీనియర్ నేత ఎంఏ బేబీ.

తిరువనంతపురం, మహా.

దేవుడి సొంత దేశం కేరళలో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ (ఈడీ) దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎమ్ఆర్ఎల్) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. తిరువనంతపురంలోని మాజీ సీఎం నివాసంతో పాటు, కన్నూరులోని ఆయన సన్నిహితుల ఇళ్లు, సీఎమ్ఆర్ఎల్ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల ఇళ్లలో.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో పది ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు జల్లెడ పడుతున్నాయి.
అసలు ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఆరోపణ విజయన్ కుమార్తె టి. వీణ చుట్టూ అల్లుకుని ఉంది. 2017 నుంచి 2020 మధ్య కాలంలో వీణకు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ అనే ఐటీ సంస్థ.. సీఎమ్ఆర్ఎల్ అనే ప్రైవేట్ కంపెనీకి ఎటువంటి సాఫ్ట్‌వేర్ సేవలు అందించకపోయినా, అక్రమంగా ఏకంగా రూ.1.72 కోట్లు ముట్టజెప్పినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కేవలం ‘ఒక ప్రముఖ అధికారిక వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం’ (తండ్రి ముఖ్యమంత్రి కావడం) వల్లే ఈ భారీ ముడుపులు నెలవారీగా చెల్లించారన్నది ప్రధాన అభియోగం. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే 2024లో ఈడీ ఈ కేసును నమోదు చేసింది. దీనిపై తమ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎమ్ఆర్ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం నాడు న్యాయస్థానం ఆ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే మరుసటి రోజు ఈడీ అధికారులు ఏకంగా మాజీ సీఎం ఇంటి తలుపులు తట్టారు.
ఈడీ దాడుల వార్త దావానలంలా వ్యాపించడంతో తిరువనంతపురంలోని పినరయి విజయన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడి ఇంట్లో సోదాలు చేయడాన్ని జీర్ణించుకోలేని సీపీఎం శ్రేణులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ అధికారుల వాహనాలపైకి దూసుకెళ్లి దాడులకు పాల్పడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతల నడుమ ఆందోళనకారులను అదుపుచేసే ప్రయత్నంలో ఒక పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి.
కేరళ రాజకీయాల్లో వరుసగా రెండు పర్యాయాలు (2016-2026) ముఖ్యమంత్రిగా విశేష అధికారం చెలాయించిన పినరయి విజయన్, గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు ఎంఏ బేబీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థల్లా వాడుకుంటూ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన మండిపడ్డారు. దేశ రాజధాని దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులపై కల్పిత ఆరోపణలు మోపి అక్రమ అరెస్టులు చేస్తున్నారనడానికి ఈ దాడులే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన విమర్శించారు. అయితే, తన కుమార్తెపై వస్తున్న ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం తన ప్రతిష్ఠను మసకబార్చడానికే ఇలా బురద జల్లుతున్నారని పినరయి విజయన్ గతంలోనే కొట్టిపారేయడం గమనార్హం.