- ప్రపంచమంతా తెలుగు వెలగాలి
- మాతృ భాషను కాపాడుకోవాలి
- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి పురస్కార ప్రదానం
హైదరాబాద్, మహా : తెలుగు భాష ప్రపంచమంతా వెలగాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ప్రముఖ సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని అందజేసి ప్రసంగించారు. ‘‘ఆంధ్ర మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించి, మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఆ రోజుల్లో తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేశారు. తెలుగు భాషా సాహిత్యానికి కృషి చేస్తున్న ఎందరో కవులు, రచయితలకు గొప్ప ఆలంబనగా నిలిచారు. వారి స్ఫూర్తితో నేటితరం తెలుగు భాష వెలుగుకు కృషి చేయాలి. ప్రపంచమంతా తెలుగు వెలగాలి.’’అని ఆకాంక్షించారు. తెలుగు సమాజం మొత్తం గర్వించతగ్గ మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని నివాళులర్పించారు. ‘‘తెలంగాణలో కవులున్నారా అన్న ప్రశ్నకు ‘గోల్కొండ కవుల సంచిక’ ద్వారా చేతలతో సమాధానమిచ్చిన పరిశోధక చైతన్య శీలి సురవరంగారు. ఇప్పటిలాగా సమాచారం కోసం ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ లేదా డిజిటల్ లైబ్రరీలు లేని ఆ రోజుల్లోనే… ఊరూరా తిరిగి, ప్రతి ఒక్కరిని కలిసి 354 మంది కవుల జీవితాలను ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. పరిశోధనా రంగానికి ఆయన చేసిన ఈ కృషి ఒక గీటురాయి లాంటిది.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘నాటి నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి ‘గోలకొండ పత్రిక’ ద్వారా విలువలతో కూడిన జర్నలిజానికి సురవరం ప్రతాప రెడ్డి శ్రీకారం చుట్టారు. కేవలం పత్రికకే పరిమితం కాకుండా, ఆయన కలం నుండి జాలువారిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, ‘హిందువుల పండుగలు’, ‘హైందవ ధర్మ వీరులు’ వంటి అద్భుత గ్రంథాలు… ప్రతి తెలుగువాడూ చదివి, తన ఇంట్లో దాచుకోదగిన అమూల్యమైన సాహిత్య నిధులు.’’ అని చెప్పారు. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి, గ్రంథాలయోద్యమానికి ఎనలేని సేవలు అందించిన సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉత్తమ పరిశోధకుడిగా ఎంత ఎదిగినా, జీవితాంతం నిరాడంబరునిగా, నిరంతర అధ్యయన శీలిగానే జీవించారని, వారిని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
మీడియా రంగంలో కొన్ని వర్గాల ప్రస్తుత ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘‘పాత్రికేయ విలువలు క్షీణించటం ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేస్తుంది. పత్రికలకు ఆర్థిక వనరులు అవసరమే కానీ, ఆర్థిక వనరులే పరమార్థం కాకూడదు, విలువలే మూలాలుగా ఉండాలి.’’ అని సూచించారు. ‘‘జర్నలిజంలో అర్థం లేని పోటీ తత్వం పోవాలి. సమాచారాన్ని ఎంత వేగంగా అందించాము అనే విషయం మీదకన్నా, వాస్తవాలను ఎంత సమగ్రంగా అందించాము అనే విషయం మీదనే మీడియా దృష్టి పెట్టాలి.’’ అని సూచించారు. కొంత మంది బైట్స్ తీసుకుని వాటితో ఫైట్స్ పెడుతున్నారని తనదైన శైలిలో చమత్కరించారు. సమాజంలో మాతృభాషను కాపాడుకునే చొరవ మరింత పెరగాలని, దాంతో పాటు ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల గురించి అవగాహన కల్పించటంలో పత్రికలు సమర్థమైన పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, శాంతా వసంతా ట్రస్టు వ్యవస్థాపకులు వరప్రసాద రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి కుటుంబసభ్యులు డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ సురవరం పుష్పలతా రెడ్డి, కపిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.








