దీదీకి మరో గట్టి షాక్.
* టీఎంసీ అధికార ప్రతినిధి పదవికి శంతను సేన్ రాజీనామా.
కోల్కతా,మహా.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోలుకోకముందే ఆ పార్టీకి వరుసగా ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరుగా పదవులకు గుడ్-బై చెబుతుండటం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీనియర్ నాయకురాలు కకోలీ దస్తీదార్ ఘోష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజే.. టీఎంసీలో మరో కీలక వికెట్ పడింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ శంతను సేన్ తన జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం వస్తున్న తీవ్ర అవినీతి ఆరోపణల వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని డాక్టర్ శంతను సేన్ బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ, ప్రభుత్వ తప్పులను సమర్థించుకుంటూ తన పాత్రను నిర్వర్తించే స్థితిలో తన అంతరాత్మ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో పార్టీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్న వేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
గతంలోనూ వివిధ సందర్భాల్లో తాను పార్టీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో ఏకీభవించలేకపోయానని, అనేక ప్రజాసమస్యలపై పార్టీ వేదికల లోపల, వెలుపల బహిరంగంగానే ప్రశ్నించానని శంతను సేన్ గుర్తుచేశారు. ఆ నాడు తాను నిజాయతీగా మాట్లాడినందుకే ప్రజలు వివిధ సందర్భాలలో తనను ఎంతగానో ప్రశంసించారని పేర్కొన్నారు. ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనను ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, రాష్ట్రంలో పెరిగిపోయిన నిరుద్యోగం, వెల్లువలా ముంచెత్తుతున్న అవినీతి ఆరోపణల వల్లే తీవ్ర వ్యతిరేకత వచ్చి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ను ఓడించారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత కూడా పార్టీ తీరు మారకపోవడంతోనే తాను ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శంతను సేన్ స్పష్టం చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర రక్షణలో పడింది.







