Mahaa Daily Exclusive

  మాన్వీ.. లోపలికి రావొద్దు, ఇల్లంతా విషవాయువు.

Share

మాన్వీ.. లోపలికి రావొద్దు, ఇల్లంతా విషవాయువు.
*ఆత్మహత్య చేసుకుంటూ తలుపుపై తండ్రి కన్నీటి హెచ్చరిక.
*ఉద్యోగం పోయి, ఆర్థిక ఇబ్బందులతో గుజరాత్‌లో విషాదం.
గాంధీనగర్,మహా.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆ క్షణంలోనూ ఓ తండ్రి హృదయం తన బిడ్డ భద్రత కోసమే తపించింది. తాను తీసుకున్న విషం నుంచి వెలువడే వాయువుల వల్ల తన కూతురికి ఎలాంటి హాని జరగకూడదని భావించిన ఆ తండ్రి.. చనిపోయే ముందు ఇంటి తలుపుపై రాసిన కడపటి హెచ్చరిక లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ పరిధిలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌లోని కుడాసన్ ప్రాంతంలో ఉన్న పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్‌లో పంకజ్ భన్సాలీ (42) తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం అతడి ఉద్యోగం పోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దానికి తోడు అప్పుల ఒత్తిడి కూడా విపరీతంగా పెరగడంతో పంకజ్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ పరిస్థితులను తట్టుకోలేక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘సెల్ఫాస్’ అనే అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే, తాను ప్రాణాలు తీసుకుంటున్న ఆ కడపటి క్షణాల్లోనూ పంకజ్ తన కూతురు మాన్వి గురించే ఆలోచించాడు. తాను తాగిన పురుగుల మందు వల్ల ఇల్లంతా విషవాయువులు వ్యాపిస్తాయని, ఆ గాలి పీలిస్తే తన కూతురి ప్రాణాలకే ముప్పని గ్రహించాడు. వెంటనే ఒక కాగితంపై ఆంగ్లంలో.. “మాన్వి.. దయచేసి బయటే ఉండు. లోపల విషవాయువు ఉంది. మాస్క్ వేసుకోండి.. నీళ్లు తాగొద్దు” అని రాసి, దానిని ఇంటి ప్రధాన ద్వారం బయటి వైపు తలుపుపై అంటించి ప్రాణాలు విడిచాడు.
గత మే 13వ తేదీన పంకజ్ భార్య, కూతురు పుట్టింటికి వెళ్లారు. మే 22న పంకజ్ తన భార్యతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో మే 27న వారు నేరుగా పూనమ్ రెసిడెన్సీలోని ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. ఇంటి తలుపుపై ఉన్న హెచ్చరిక లేఖను చూసి భయాందోళనలకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇన్ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే ఐదు రోజుల క్రితమే పంకజ్ మృతి చెంది ఉండటంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఫ్లాట్‌లో లభించిన విషపూరితమైన పురుగుల మందు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం కోల్పోవడం, అప్పుల బాధల వల్లే పంకజ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.