గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు అమెరికా వీడాల్సిన పనిలేదు.
* హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టత.
* ట్రంప్ సర్కార్ నిర్ణయంతో తలెత్తిన గందరగోళానికి తెర.
* అది కేవలం అధికారుల విచక్షణాధికారాల రిమైండర్ మాత్రమేనని వెల్లడి.
వాషింగ్టన్,మహా.
అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకుని, ఆ ప్రక్రియ పరిశీలనలో ఉన్న వలసదారులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఇటీవల యూఎస్సీఐఎస్ విడుదల చేసిన ఒక అంతర్గత మెమో కారణంగా అమెరికాలోని విదేశీ నిపుణులు, తాత్కాలిక వీసాదారుల్లో చెలరేగిన తీవ్ర ఆందోళనలు, గందరగోళానికి ఈ వివరణతో తెరపడింది.
**మెమోతో పెరిగిన టెన్షన్..**
మే 21న యూఎస్సీఐఎస్ ఒక విధాన మెమోను విడుదల చేసింది. గ్రీన్‌కార్డ్ అనేది ఆటోమేటిక్ హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వ విచక్షణా ప్రయోజనం మాత్రమేనని అందులో పేర్కొంది. అసాధారణ మినహాయింపులు ఉంటే తప్ప, దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు వెళ్లి ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే వేచి ఉండాలని ఆ ఉత్తర్వుల సారాంశం. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు పెద్ద షాక్ ఇచ్చిందని, వలసదారులు అమెరికా వీడాల్సిందేనంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో వలసదారుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది.
**విధానంలో ఎలాంటి మార్పూ లేదు..**
ఈ వివాదంపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ.. ఇమ్మిగ్రేషన్ విధానంలో ఎలాంటి విస్తృత మార్పులు చేయలేదని తేల్చిచెప్పింది. దరఖాస్తులను పరిశీలించే ఇమ్మిగ్రేషన్ అధికారులకు.. సదరు దరఖాస్తు ప్రక్రియను అమెరికా లోపల పూర్తి చేయాలా లేక వెలుపల పూర్తి చేయాలా అని నిర్ణయించే విచక్షణాధికారాలు ఎప్పటి నుంచో ఉన్నాయని, ఆ నిబంధనను గుర్తు చేస్తూ ఈ రిమైండర్ జారీ చేశామని డీహెచ్ఎస్ ప్రతినిధి వివరించారు. దరఖాస్తులు సమీక్షలో ఉన్నంత కాలం అత్యధిక శాతం వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, కాకపోతే వీసా గడువు ముగిసిన వారు లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఉన్నవారి విషయంలో కేస్-బై-కేస్ ప్రాతిపదికన అధికారులు నిర్ణయం తీసుకుంటారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అలాగే “ఆర్థిక ప్రయోజనం”, “జాతీయ ప్రయోజనం” ఆధారంగా దరఖాస్తుదారులకు మినహాయింపులు ఉంటాయని యూఎస్సీఐఎస్ వెల్లడించింది.
**పరిశీలన మాత్రం కఠినం..**
ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలు కఠినతరం కానున్నాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చి శాశ్వత నివాసం కోరే దరఖాస్తుదారుల ఫైళ్లను అధికారులు ఇకపై మరింత క్షుణ్ణంగా, కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో శాశ్వత నివాసంతో పాటు, అక్కడ చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకునేందుకు, భవిష్యత్తులో అమెరికా పౌరసత్వం పొందేందుకు గ్రీన్‌కార్డ్ మార్గం సుగమం చేస్తుంది. గతేడాది (2024) అమెరికా ప్రభుత్వం సుమారు 1.4 మిలియన్ల (14 లక్షల) గ్రీన్‌కార్డ్‌లను మంజూరు చేయగా.. అందులో అత్యధికంగా 8,20,000 మంది “అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్” ప్రక్రియ ద్వారా అమెరికాలోనే ఉంటూ గ్రీన్‌కార్డులు పొందారు. సాధారణంగా విదేశీయులు తమ యజమానుల (కంపెనీల) స్పాన్సర్షిప్ లేదా కుటుంబ సంబంధాల ద్వారా ఈ గ్రీన్కార్డ్కు అర్హత సాధిస్తుంటారు. తాజాగా డీహెచ్ఎస్ ఇచ్చిన వివరణతో లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద ఊరట లభించినట్లయింది.








