Mahaa Daily Exclusive

  విశాఖ సమగ్రాభివృద్ధికి ‘దిశ’ నిర్దేశం…

Share

విశాఖ సమగ్రాభివృద్ధికి ‘దిశ’ నిర్దేశం.
* రూ.1,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు: ఎంపీ శ్రీభరత్‌.
*గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెరిగిన ప్రాజెక్టుల వ్యయం.
*త్వరలో సాగర తీరంలో ఖనిజ సంపద వెలికితీత.
*సీఎం ప్రత్యేక దృష్టితో పరుగులు పెడుతున్న పనులు: ఎమ్మెల్యే గణబాబు.
విశాఖపట్నం, మహా.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు ‘దిశ’ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశాలు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా గుర్తింపు పొందుతున్న విశాఖపట్నాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల పూర్తి సమన్వయంతో మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్తామని ఆయన ఉద్ఘాటించారు. నగరంలో ఇటీవల నిర్వహించిన దిశ సమావేశంలో 33 ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి పలు కీలక అభివృద్ధి అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
**రూ.1,500 కోట్లతో మౌలిక వసతుల కల్పన..**
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ ద్వారా విశాఖపట్నం నగరానికి ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు మంజూరైనట్లు వెల్లడించారు. ప్రధానంగా మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ నిర్మాణం, నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచడం, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం లాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టులను చేపట్టామన్నారు. వీటి పురోగతిని తాజా సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు మరోసారి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, విశాఖ తీరప్రాంతంలో అందుబాటులో ఉన్న విలువైన ఖనిజ సంపదను సైతం త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని ప్రకటించారు.
**గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఆగిన పనులు..**
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అనేక కీలక ప్రాజెక్టులు అటకెక్కాయని, ఫలితంగా వాటి నిర్మాణ వ్యయం ప్రస్తుతం భారీ స్థాయిలో పెరిగిపోయిందని ఆరోపించారు. అలా మూలనపడిన ప్రాజెక్టులన్నింటికీ ఇప్పుడు కొత్త పథకాల ద్వారా జీవం పోసి, తిరిగి పట్టాలెక్కిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
**సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ..**
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సీఎం దిశానిర్దేశంలో విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును దిశ సమావేశంలో సమగ్రంగా సమీక్షించామని, ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి ఉన్నత స్థాయి సమీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆశించిన మేర సత్ఫలితాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే గణబాబు వివరించారు.