Mahaa Daily Exclusive

  చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర…

Share

  • చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర
  • బట్టబయలు చేసిన హైడ్రా
  • గండిపేట ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్
  • చెరువు మధ్యలో నిర్మించిన కట్టడాలను తొలగింపు
  • రూ. 5,500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్

హైదరాబాద్, మహా : జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా దూసుకుపోతున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్‌తో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాల్‌గూడ – నార్సింగి పరిధిలోని ముష్కిన్ చెరువు ఆక్రమణలపై శనివారం ఉక్కుపాదం మోపింది. సుమారు 5,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి, చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ముష్కిన్ చెరువు పరిరక్షణ పేరుతో జరిగిన ఒక భారీ భూకబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చి, అసలు కథ నడిపింది. చెరువు మధ్యలో ఏకంగా ఒక ఆనకట్ట వంటి కట్టడాన్ని నిర్మించి, సుమారు 34.21 ఎకరాల జలవనరును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది. నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా, వాటిని పూర్తిగా తొలగించి చెరువుకు పూర్వవైభవం తెచ్చే పనిలో పడింది.

రూ. 5,500 కోట్ల భూమికి రక్షణ కవచం

హెచ్‌ఎండిఏ లెక్కల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది 59.11 ఎకరాల వరకు ఉండగా, ఇందులో 20.23 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. ఈ భూమిపై కన్నేసిన రియల్టర్లు, పేదల పేరుతో అక్కడ గుడిసెలు వేయించి కబ్జాకు తెరలేపారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ అక్షరాలా 5,500 కోట్ల రూపాయలు. ఇంతటి భారీ విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు హైడ్రా శనివారం నుంచి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది.

పేదల ముసుగులో రియల్టర్ల మాయాజాలం

చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో గుడిసెలు వేయించి, ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూసిన రియల్టర్ల వ్యూహానికి హైడ్రా చెక్ పెట్టింది. అక్కడ నివసిస్తున్న వారికి రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చి, ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చింది. హైడ్రా హెచ్చరికలతో గుడిసెల్లోని వారు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, అధికారులు శనివారం ఎలాంటి ఆటంకం లేకుండా క్లీన్ స్వీప్ చేశారు. చెరువు మధ్యలో పోసిన మట్టి కట్టలను, అక్రమంగా నిర్మించిన ఎంబ్యాంక్‌మెంట్‌ను జేసీబీలతో తొలగించి నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చేశారు.

నిబంధనల ఉల్లంఘనపై ఉక్కుపాదం

చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన సంస్థ పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి, మిగిలిన భూమిని కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని హైడ్రా వర్గాలు తెలిపాయి. ఎఫ్‌టిఎల్ సరిహద్దులను నిర్ణయించి, ఏ ఒక్క అంగుళం భూమి కూడా అక్రమార్కుల పాలు కాకుండా పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూమితో పాటు ఎక్సల్ పట్టా భూముల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా దృష్టి సారించింది. ముష్కిన్ చెరువు రక్షణ కోసం హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ రియల్ ఎస్టేట్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది. చెరువుల పునరుద్ధరణ పేరుతో భూములను మింగేయాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది. శనివారం రోజంతా సాగిన ఈ ఆపరేషన్‌తో గండిపేట పరిసర ప్రాంతాల్లో భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.