ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్.
* సర్వీసులో కొనసాగాలంటే ‘టెట్’ ప్యాసవ్వాల్సిందే.
*ఉపాధ్యాయుల భద్రత కోసం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టలేమన్న ధర్మాసనం.
*టెట్ ఉత్తీర్ణతకు 2028, ఆగస్టు 31 వరకు ఆఖరి అవకాశం.
*2025 తీర్పుపై దాఖలైన 70 రివ్యూ పిటిషన్ల కొట్టివేత.
ఢిల్లీ, మహా.
నాణ్యమైన విద్య విద్యార్థుల ప్రాథమిక హక్కని, పిల్లల భవిష్యత్తుతో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల నాణ్యతను పెంచే దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధుల్లో ఉన్న (ఇన్-సర్వీస్) ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి చేస్తూ గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా మరోసారి సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రాష్ట్రాలు దాఖలు చేసిన సుమారు 70 రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ.. టెట్ అర్హత సాధించేందుకు 28, ఆగస్టు 31 వరకు తుది గడువును విధించింది.
**రాజ్యాంగబద్ధమైన హక్కు.. రాజీపడలేం:**
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టెట్ అనేది కేవలం ఒక సాధారణ చట్టపరమైన నిబంధన కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఎ కల్పిస్తున్న ‘నాణ్యమైన విద్యా హక్కు’కు సంబంధించిన అత్యంత కీలకమైన రాజ్యాంగపరమైన అంశమని కోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతుందన్న కేవలం ఒక్క కారణంతో, లక్షలాది మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తుకు భంగం కలిగించలేమని న్యాయమూర్తులు కుండబద్దలు కొట్టారు. ఉపాధ్యాయుల కష్టాల పట్ల తమకు సానుభూతి ఉన్నప్పటికీ, చట్టాన్ని అధిగమించి ఉప-నిబంధనలు చెల్లవని తేల్చిచెప్పారు.
**పిటిషనర్ల వాదనలు తోసిపుచ్చిన కోర్టు:**
2010 కంటే ముందు అప్పటి నిబంధనల ప్రకారం నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ను రెట్రోస్పెక్టివ్‌గా (గతకాలానికి వర్తించేలా) అమలు చేయడం అన్యాయమని, గతంలో ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం వీరికి మినహాయింపు ఉందని పిటిషనర్లు కోర్టులో వాదించారు. ఇప్పుడు టెట్ తప్పనిసరి చేస్తే సీనియర్ ఉపాధ్యాయులు సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని, దానివల్ల విద్యావ్యవస్థ కుంటుపడుతుందని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు, దానికి సంబంధించిన 2017 సవరణ జరిగి దశాబ్దం గడుస్తున్నా.. అర్హత సాధించేందుకు ఆ సమయం సరిపోలేదా? అని కోర్టు ప్రశ్నించింది. అభద్రతా భావం ఉందనే కారణం తమ తీర్పును మార్చడానికి తగిన ఆధారం కాబోదని స్పష్టం చేసింది.
**గతేడాది 2025 నాటి తీర్పులో ఏముందంటే..**
2025 సెప్టెంబర్ 1న ‘అంజుమన్ ఇషాత్-ఎ-తాలీమ్ ట్రస్ట్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఈ టెట్ నిబంధనపై స్పష్టత ఇచ్చింది. 2009కి ముందు ప్రభుత్వ సర్వీసులో చేరిన వారితో పాటు, పదవీ విరమణకు (సూపర్ అన్యువేషన్) ఐదేళ్ల సమయం మాత్రమే ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు సైతం రెండేళ్ల వ్యవధిలో టెట్ పాస్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఉద్యోగోన్నతులు (ప్రమోషన్లు) పొందాలన్నా టెట్ తప్పనిసరని అందులో స్పష్టం చేసింది.
**ఆగస్టు 2028 ఆఖరి డెడ్‌లైన్..**
తాజా సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం పడనుంది. కోర్టు ఇచ్చిన తాజా సడలింపు ప్రకారం.. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ టెట్ అర్హత సాధించాలి. లేనిపక్షంలో వారు విధుల్లో కొనసాగేందుకు, అలాగే ప్రమోషన్లు పొందేందుకు అర్హత కోల్పోతారు. నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ తీర్పు మరింత బలాన్ని చేకూర్చింది.







