Mahaa Daily Exclusive

  పేదలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్….

Share

పేదలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.
* ఎక్కడికక్కడే లక్ష ఇందిరమ్మ ఇళ్లు.
* గత పాలకుల్లా ఊరు బయటకు విసిరేయం.
* ఏ నియోజకవర్గంలో వారికి అక్కడే గూడు.
* పేదల జీవనోపాధికి భంగం కలగకుండా సీఎం రేవంత్ ఇస్తున్న పెద్దన్న కానుక.
* త్వరలోనే గ్రేటర్ పరిధిలో తొలి విడత లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన.
* కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు.
* నిర్మాణానికి మంత్రుల భూమిపూజ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) కానుకగా పేద, మధ్యతరగతి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరమ్మ ఇళ్ల’ మంజూరుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, క్షేత్రస్థాయి నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే నిరుపేదలకు అత్యంత భారీ ఊరటనిస్తూ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సంచలన ప్రకటన చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సర్కార్ విధాన నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. కూలీనాలీ చేసుకునే పేదల జీవనోపాధికి, వారి దైనందిన ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. వారు ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే, వారికి అందుబాటులో అత్యంత ఆధునిక వసతులతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
**పేదలకు సీఎం రేవంత్ అపురూప కానుక..**
బంజారాహిల్స్‌లో సుమారు 30 వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ (సమీకృత) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పాలకుల్లాగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పి, వారిని ఉపాధికి దూరంగా 30 నుంచి 40 కిలోమీటర్ల అవతలకు, ఊరు బయటకు తరిమేసే ఆలోచన ఈ ప్రజా ప్రభుత్వానికి లేనేలేదని తేల్చిచెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, స్థానికంగా ఉన్న పేదలకు ఆ ప్రాంతంలోనే సొంత గూడు కల్పిస్తామన్నారు. ఇది నిరుపేదలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న అపురూపమైన కానుక అని మంత్రి కొనియాడారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలివిడతగా ఏకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. క్యాలెండర్ ఏడాది తిరిగేలోగా ఈ లక్ష ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, ఆ వెంటనే మలి విడత కింద మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. పేదవాని గుమ్మం వద్దకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం శ్రమిస్తున్నామని ఉద్ఘాటించారు.
**కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు..**
ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే తదితర కీలక శాఖలన్నీ ప్రజలకు ఒకే చోట సులభంగా అందుబాటులోకి తెచ్చేలా ఈ సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి వివరించారు. జిహెచ్ఎంసీ (గ్రేటర్) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగానికి ఏమాత్రం తీసిపోని విధంగా, సర్వాంగ సుందరంగా కార్పొరేట్ ఆఫీసుల తరహాలో వీటిని ఆధునీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా, ఈ అత్యున్నత భవన నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి కూడా నిధుల భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఫినిక్స్’ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ నిర్మాణ బాధ్యతలను స్వీకరించిందని, రికార్డు సమయంలోనే బంజారాహిల్స్‌లోని ఈ బహుళ అంతస్తుల సమీకృత భవనం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.