Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో అరాచకాలకు తావులేదు….

Share

రాష్ట్రంలో అరాచకాలకు తావులేదు.
* 2029 లక్ష్యంగా సన్నద్ధం కావాలి.
* ప్రతిపక్ష హోదా లేకున్నా ‘గొడ్డలి పార్టీ’ అహంకారం తగ్గలేదు.
* రాజకీయాల్లో నేరాలు, దౌర్జన్యాలు చేసే పార్టీలను ఉపేక్షించం.
* అమరావతిలో ప్రతిష్టాత్మక ‘నిఫ్ట్’.
* కుప్పంలో పీఎం మిత్ర పార్క్ 2.0.
* మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటనలు.
అమరావతి, మహా.
ఐదేళ్ల పాటు అరాచక పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వారికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఘోర పరాజయంతో కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోయినా గత పాలకుల అహంకారం ఏమాత్రం తగ్గలేదని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో నేరాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చేసే పార్టీలు ఉంటాయని తాను కలలో కూడా ఊహించలేదని, ‘గొడ్డలి పార్టీ’కి రాష్ట్రంలో ఇక నూకలు చెల్లినట్లేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలు, విపక్షాల తీరు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూనే, 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమర శంఖం పూరించాలని, ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.. ఎన్డీయే అగైన్ అండ్ అగైన్’ అనే నినాదంతో ప్రతి కార్యకర్తా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించిన చంద్రబాబు.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాన టెక్స్‌టైల్, విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ (నిఫ్ట్) క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే పది ఎకరాల విలువైన భూమిని కేటాయించామని, ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు 280 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు స్పష్టం చేశారు. అలాగే కుప్పంలో ‘పీఎం మిత్ర పార్క్ 2.0’, మంగళగిరిలో రూ.22 కోట్లతో అత్యాధునిక చేనేత పార్కు, అమరావతిలో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయ వ్యర్థాలైన అరటి, వెదురు, కొబ్బరి పీచు లాంటి వాటి నుంచి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా ‘నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్’ కింద ఆంధ్రప్రదేశ్‌ను ప్రాధాన్యత జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు రాష్ట్రాభివృద్ధే రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని, విధ్వంసకర శక్తుల కుట్రలను తిప్పికొట్టి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తిరుగులేని అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే తమ అంతిమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.