మహిళా సాధికారత దిశగా అడుగులు.
* ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సు.
*జూన్ 2న మహిళలకు సీఎం రేవంత్ సర్కార్ భారీ కానుక.
* ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా మహిళా సంఘాలకు సున్నా వడ్డీకి రుణాలు.
* పాఠశాలలు తెరవకముందే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు: మంత్రి సీతక్క.
హైదరాబాద్, మహా .
మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్లి ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించి, మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు బాటలు వేస్తూ.. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల కోసం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టబోతోందని మంత్రి సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో జూన్ 2న ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సు చొప్పున మొత్తం 600 బస్సులను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు కేటాయించబోతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ నిర్ణయం మహిళలకు గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పించడంతో పాటు ఆర్టీసీ ఆదాయాన్ని పెంపొందించడానికి కూడా దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం సున్నా వడ్డీకే (వడ్డీ లేని) రుణాలను పెద్ద ఎత్తున పంపిణీ చేయనుందని ఆమె హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనుకునే ప్రతి మహిళకు ఈ రుణాలు ఒక వరంగా మారతాయన్నారు.
మహిళా సంక్షేమంతో పాటు విద్యా రంగానికి కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. వేసవి సెలవులు ముగిసి విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం దుస్తులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మహిళల సాధికారత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా నెరవేరుస్తుందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.







