Mahaa Daily Exclusive

  కంచే చేను మేసిన చందంగా…

Share

కంచే చేను మేసిన చందంగా.
* ఏసీబీకి అడ్డంగా దొరికిన సైబర్ ఇన్‌స్పెక్టర్.
* రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.
* కేసు నుంచి తప్పించేందుకు 9 లక్షలు డిమాండ్.
*ఇంట్లో సోదాలు.. రూ. 13 లక్షల నగదు, భారీగా బంగారం, ఆస్తి పత్రాలు సీజ్.
* నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితుడి హాజరు.
హైదరాబాద్, మహా.

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అత్యున్నత విభాగంలో పనిచేస్తూ అక్రమ వసూళ్లకు తెరతీసిన ఓ పోలీసు అధికారి బండారం బట్టబయలైంది. సైబర్ నేరాలను అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఒక సైబర్ మోసం కేసులో బాధితుడి కుటుంబ సభ్యుల పేర్లను ఇరికించకుండా ఉండేందుకు ఏకంగా రూ. 9 లక్షలు డిమాండ్ చేసి, ఇప్పటికే రూ. 5 లక్షలు గుటకేసిన ఆ అధికారి.. మిగిలిన రూ. 4 లక్షల కోసం బెదిరింపులకు దిగి కటకటాల పాలయ్యాడు. శనివారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, అతడి నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
కేసు వివరాల్లోకి వెళితే.. ఓ సైబర్ నేరం కేసు దర్యాప్తులో భాగంగా ఇన్‌స్పెక్టర్ మహేందర్ విచారణ చేపట్టాడు. ఈ క్రమంలో సదరు కేసులో బాధితుడి కుటుంబ సభ్యుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చకుండా, వారికి అనుకూలంగా వ్యవహరించాలంటే తనకు రూ. 9 లక్షలు సమర్పించుకోవాల్సిందేనని మహేందర్ తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురిచేశాడు. పోలీసుల బెదిరింపులతో భయాందోళనలకు గురైన బాధితుడు ముందుగా రూ. 5 లక్షలు సమకూర్చి ఇన్‌స్పెక్టర్‌కు అందజేశాడు.
అంతటితో ఆగని ఆ అవినీతి అధికారి మిగిలిన రూ. 4 లక్షల కోసం బాధితుడిని పదేపదే వేధించడం మొదలుపెట్టాడు. వెంటనే డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరినీ కేసులో ఇరికిస్తానని తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. ఇన్‌స్పెక్టర్ వేధింపులు భరించలేని బాధితుడు విసిగిపోయి ధైర్యం చేసి నేరుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు, అవినీతి అధికారిని పట్టుకునేందుకు పక్కా వ్యూహం పన్నారు.
ముందుగా అనుకున్న పథకం ప్రకారం శనివారం బాధితుడి నుంచి మిగిలిన రూ. 4 లక్షల లంచం మొత్తాన్ని ఇన్‌స్పెక్టర్ మహేందర్ తీసుకుంటుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. రసాయన పరీక్షల ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించి సదరు నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంటనే ఇన్‌స్పెక్టర్ అధికారిక నివాసంలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ. 13 లక్షల అదనపు నగదుతో పాటు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, పలు కీలక ఆస్తి పత్రాలను అధికారులు కనుగొన్నారు.
సైబర్ కేసుల దర్యాప్తు ముసుగులో నిందితుడు మహేందర్ గతంలోనూ ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడా అన్న కోణంలో ఏసీబీ లోతైన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపైనా ఆరా తీస్తోంది. అరెస్ట్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం నిందితుడు బత్తుల మహేందర్‌ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారి ఏసీబీ వలలో చిక్కుకోవడం స్థానిక పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.