- చార్ ధామ్… జామ్ ధామ్
- భారీగా పెరిగిన భక్తులు
- విరిగిపడుతున్న కొండచరియలు
- కంగారులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- యాత్ర నిలిపి వేస్తారన్న ప్రచారం జోరు
డెహరాడూన్, మహా : చార్ ధామ్ యాత్ర. ఒక్క సారైనా జీవితంలో గంగోత్రి, యుమునోత్రి, కేదార్ నాథ్, భద్రీనాథ్ ఆలయాలను దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోవాలని ప్రతి హిందూ భావిస్తుంటారు. ఏడాదిలో కేవలం నాలుగు మాసాలే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. హిమాలయ పర్వత శ్రేణులకు అతి సమీపంలో ఉన్న దేవాలయాలను దర్శించుకోవడం అంటే పెద్ద సాహసం చేయడమే అని గతంలో చేసుకునే వారు. కానీ కాల క్రమేణా రవాణా సౌకర్యాలు పెరగడం, రోడ్డు మార్గంలోనే కాకుండా హెలీ కాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో చార్ ధామ్ యాత్రకు ఏటేటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో యాత్ర ప్రారంభం నుంచి భక్తుల రద్దీ తీవ్రమైంది. యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి నెలకొంది. గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు.
కేదార్ నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా వీలు లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో జోషీ మఠ్ వద్ద దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో యాత్రికులు గంటల తరబడి వాహనాల్లోనే గడపాల్సి పరిస్థితి నెలకొంది. ఇందుకు తోడుగా యాత్ర మార్గంలో భారీగా కొండ చరియలు విరిగి పడుతుండటంతో భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అయితే యాత్రికులు ఎలాంటి సౌకర్యాలు లేని చోట్ల చిక్కుకుపోతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులు కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు యాత్రికుల సంఖ్య పెరగడం, మరో వైపు భారీగా కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఈ సారి యాత్ర ముగిసే వరకు ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందో అన్న కంగారు ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో నెలకొంది. యాత్రికుల సౌకర్యార్థం అధికారులు గత ఏడాది కంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రకృతి ప్రకోపడం, పెరుగుతున్న యాత్రికుల నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అక్కడి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట కొండ చరియ విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో భక్తుల్లోనూ కొంత అభద్రతాభావం నెలకొంది. అయినప్పటికీ జీవితకాల స్వప్నం చార్ ధామ్ దర్శనం కోసం సాహసం చేస్తూనే ఉన్నారు. అయితే భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ కొంత కాలం చార్ ధామ్ యాత్రకు పుల్ స్టాప్ పెడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొత్తగా యాత్రకు రావాలనుకునే వారు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అవస్థలు ఇప్పటికే యాత్ర మధ్య ఉండి పడుతున్న భక్తులు సూచిస్తున్నారు.







