Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు…..

Share

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.
* సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
* బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లపై అక్రమ నిఘా.
* ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి లంచ్ వివరాలు సేకరణ.
* వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.

హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు గతంలో చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఈరోజు వారు నేరుగా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డిలకు తెలంగాణ ప్రత్యేక విచారణ బృందం (సిట్) సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసి, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించింది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు వారి నుంచి పూర్తి స్థాయి వివరాలను సేకరించారు.

*సాంకేతిక ఆధారాల సేకరణ.. వాంగ్మూలాల నమోదు*

శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టేందుకు ఈ ఇద్దరు నేతల ఫోన్ నంబర్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు ఇప్పటికే బలమైన సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే, ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలకు గల ప్రధాన ప్రాతిపదిక ఏమిటి? వారి వద్ద ఏమైనా అదనపు ఆధారాలు ఉన్నాయా? అప్పట్లో నిఘాకు సంబంధించి వారు గమనించిన అనుమానాస్పద పరిణామాలు ఏమిటి? తదితర పూర్తి వివరాలను రాబట్టడంపైనే ప్రస్తుత విచారణలో అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. సిట్ అధికారులు తాము సేకరించిన సాంకేతిక సాక్ష్యాలను వారి ముందుంచి, అధికారికంగా వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.

*సంచలనంగా మారిన ‘ట్యాపింగ్’ వ్యవహారం*

నిజానికి గతంలోనే ఈ వ్యవహారంపై విచారణకు రావాలంటూ సిట్ అధికారులు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే, అనివార్య కారణాలు, ముందస్తు కార్యక్రమాల వల్ల వారు అప్పట్లో హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మరోసారి తాజా నోటీసులు ఇచ్చి విచారణకు రప్పించింది. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు, వారి వ్యూహాలను పసిగట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ సంస్థలను తీవ్రంగా దుర్వినియోగం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు, సిట్ దూకుడు పెంచడం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని సంచలన నిజాలు వెలుగుచూస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.