* కుర్చీకి ‘నో’.. చాపకు ‘ఎస్’…
* ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ సరికొత్త ‘విజువల్ పాలిటిక్స్’!
* దగ్గరగా అంటే…నిజంగానే దగ్గరగా.
• నెట్టింట హోరెత్తిన మీమ్స్ జాతర.
ఆసిఫాబాద్,మహా.
రాజకీయాల్లో ఏ చిన్న అడుగు వేసినా దాని వెనుక ఓ పెద్ద వ్యూహం ఉంటుంది. నాయకులు వేదికలెక్కి చేసే ప్రసంగాల కంటే, వారు చేసే చిన్న చిన్న చేతలే జనాల్లోకి బలంగా వెళ్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆసిఫాబాద్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభోత్సవ సభలో చోటుచేసుకుంది. అధికారులందరూ ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అత్యంత శ్రద్ధగా ఒక ప్రత్యేకమైన కుర్చీని సిద్ధం చేశారు. కానీ, సీఎం మాత్రం ఆ అధికారిక కుర్చీకి సున్నితంగా ‘నో థాంక్యూ’ చెప్పేసి, నేరుగా వెళ్లి మహిళల మధ్య చాపపై కూర్చున్నారు. దీంతో వేదికపై ఠీవిగా ఉన్న కుర్చీలన్నీ ఒక్కసారిగా తమ ఉనికిని కోల్పోయి.. తమ భవిష్యత్తు ఏంటా అని ఆలోచనలో పడిపోయినట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది! ఈ సరికొత్త ‘విజువల్ పాలిటిక్స్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
**దగ్గరగా అంటే…నిజంగానే దగ్గరగా!**
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు తాము ఎంతో దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు సభల్లో భారీ వేదికలెక్కి చేతులు ఊపుతారు.. మైకుల్లో హామీల వర్షం కురిపిస్తారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి అందరికంటే ఒక అడుగు ముందుకేశారు. “ప్రజలకు దగ్గరగా ఉండటం అంటే కేవలం మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి” అన్నట్లుగా మహిళల పక్కనే నేల మీద కూర్చుని ముచ్చటించారు. ముఖ్యమంత్రి హఠాత్తుగా కింద కూర్చోవడంతో అంతవరకు ప్రొటోకాల్స్, కుర్చీల అమరిక కోసం తెగ శ్రమించిన అధికారులు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. తాము పడిన శ్రమ అంతా వృథా అయిందేమోనని వారు తలలు పట్టుకున్న దృశ్యం అక్కడున్న వారిని నవ్వించింది.
**నెట్టింట హోరెత్తిన మీమ్స్ జాతర**
ముఖ్యమంత్రి నేలపై కూర్చున్న దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా సైన్యం ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగి తమ క్రియేటివిటీకి పదును పెట్టింది. క్షణాల్లోనే మీమ్స్ వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు “కుర్చీ కోసం రాజకీయాలు చేసే రోజులు పోయాయి… ఇప్పుడు కుర్చీని వదిలి రాజకీయాలు చేసే రోజులు వచ్చాయి” అంటూ పోస్టులు పెడుతుంటే… మరికొందరు ఏకంగా “కుర్చీలో కూర్చుంటే సీఎం… కింద కూర్చుంటే కామన్ మ్యాన్ సీఎం” అంటూ సరికొత్త రాజకీయ సిద్ధాంతాలనే తెరపైకి తెచ్చారు. ఈ వినూత్న కామెంట్లతో సదరు ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
**వ్యూహమా? పబ్లిసిటీ స్టంటా?.. ప్రతిపక్షాల సెటైర్లు**
రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికంగా జరగదని, ప్రతి అడుగు వెనుకా ఒక స్పష్టమైన వ్యూహం ఉంటుందని విశ్లేషకులు అంటుంటారు. ప్రతిపక్షాలైతే సీఎం చర్యను పక్కా పొలిటికల్ స్ట్రాటజీగా అభివర్ణిస్తున్నాయి. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు దగ్గర పడినప్పుడు నాయకులు ప్రజల మధ్య కూర్చోవడం, పిల్లలను ఎత్తుకుని ముద్దాడటం, సాధారణ హోటళ్లలో టీ తాగడం, పొలం దున్నడం వంటివి రాజకీయాల్లో ఎప్పట్నుంచో వస్తున్న ‘సంప్రదాయ’ కార్యక్రమాల్లో భాగమేనని సెటైర్లు పేలుస్తున్నాయి. “ఇంకొన్ని రోజులు ఆగితే బహుశా అధికారులు సీఎం కోసం ఎంత ఖరీదైన సోఫా వేసినా.. ఆయన మాత్రం చాప మీదే కూర్చుంటారేమో!” అంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నాయి.
**అధికారులకు మొదలైన మిలియన్ డాలర్ల టెన్షన్!**
ఏది ఏమైనా ఆసిఫాబాద్ సభలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కంటే… సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న స్థలమే ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. దశాబ్దాలుగా రాజకీయాల్లో కుర్చీ కోసం జరిగే కురుక్షేత్రాలను చూసిన జనాలకి.. ఆ కుర్చీనే పక్కనపెట్టి నేలపై కూర్చున్న సీఎం ఒక కొత్త పాఠం నేర్పారనే చెప్పాలి.
అయితే, ఈ సంఘటన తర్వాత అధికారులకు ఒక సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇకపై జరగబోయే ముఖ్యమంత్రి సభలకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదే వారి ఇపుడు వారి ప్రధాన సమస్య. “ప్రొటోకాల్ ప్రకారం వీఐపీ కుర్చీలు వేయాలా? లేక ముందుగానే అంచనా వేసి మంచి చాపలు, పరుపులు ఆర్డర్ ఇచ్చి కింద పరచాలా?” అన్నది సచివాలయ వర్గాల్లో నడుస్తున్న అతి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది!








