Mahaa Daily Exclusive

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా……

Share

  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
  • 91 మంది ఖైదీలకు విముక్తి
  • జీవిత ఖైదీలు నేరాలను వదిలి కొత్త జీవితంలో అడుగు పెట్టండి
  • తెలంగాణ జైల శాఖ డిజి సౌమ్య మిశ్రా పిలుపు

కుషాయిగూడ, మహా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన 91 మంది ఖైదీలను మంగళవారం విడుదల చేశారు. వీరిలో 6 మంది మహిళా ఖైదీలు, 85 మంది పురుష ఖైదీలు ఉన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్గదర్శక ఉపాధి కల్పన సభలో ఖైదీల విడుదల కార్యక్రమం జరిగింది. జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీలు సంపత్, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ప్రమోద్, శివకుమార్ గౌడ్, భరత్ రెడ్డి, కళాసాగర్, సంతోష్ రాయ్, వెంకటలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదలైన మహిళా ఖైదీలకు జీవనోపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లను డీజీ సౌమ్య మిశ్రా పంపిణీ చేశారు. అలాగే పురుష ఖైదీలకు జైళ్లశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు, వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విడుదలైన ఖైదీలు ఇకపై సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని సౌమ్య మిశ్రా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విడుదలైన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.