సరికొత్త చరిత్ర సృష్టించనున్న మోదీ.
* నెహ్రూ రికార్డు బద్దలు.
* అత్యధిక కాలం నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న అరుదైన మైలురాయి.
ఢిల్లీ,మహా.
భారత రాజకీయ ముఖచిత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన, చారిత్రక మైలురాయిని లిఖించనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా దేశాన్ని పాలించిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. జూన్ 10వ తేదీ నాటికి ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట దశాబ్దాలుగా పదిలంగా ఉన్న రికార్డు బద్దలు కానుంది.
దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత 1952 మే 13వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న ఆయన తుదిశ్వాస విడిచే వరకు వరుసగా 4,398 రోజుల పాటు అదే పదవిలో కొనసాగారు. ఇక 2014 మే 26న తొలిసారిగా భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. అప్పటి నుంచి అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీ నాటికి ఆయన వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉన్న 4,077 రోజుల నిరంతరాయ పాలన రికార్డును సైతం 2025 జులై 25న మోదీ దాటేసిన విషయం తెలిసిందే.
నెహ్రూ కాలంతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం, దేశ జనాభా, ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో దేశ జనాభా కేవలం 34 కోట్లు కాగా, అందులో 17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అప్పట్లో 53 రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే, మోదీ తొలిసారి ప్రధాని అయ్యే నాటికి దేశ జనాభా 131 కోట్లకు చేరగా.. ప్రస్తుతం అది 146 కోట్లు దాటింది. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పోటీ చేసిన పార్టీల సంఖ్య సైతం ఏకంగా 744కు చేరడం గమనార్హం. ఇలాంటి సంక్లిష్టమైన, అత్యంత పోటీతో కూడిన రాజకీయ వాతావరణంలోనూ మోదీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.
ఈ ఘనతతో పాటు మోదీ ఖాతాలో ఇప్పటికే పలు అరుదైన రికార్డులు ఉన్నాయి. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఏకైక ప్రధానిగా మోదీ చరిత్రకెక్కారు. అలాగే కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ సాధించిన రికార్డు సైతం ఆయనదే. వీటికి తోడు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా కలుపుకుని అత్యధిక కాలం (8,930 రోజులకు పైగా) పాటు అధికారంలో కొనసాగిన ప్రజాప్రతినిధిగా ఆయన ఇప్పటికే ఒక సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం.







