Mahaa Daily Exclusive

  ఆర్థిక ప్రగతిపై ప్రధాని మోదీ మథనం…

Share

ఆర్థిక ప్రగతిపై ప్రధాని మోదీ మథనం.
* సంక్షోభాల వేళ పటిష్ట వ్యూహాలు.
* ఈఏసీ సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష.
* భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పరిస్థితులపై సుదీర్ఘ చర్చలు.
* అంచనాలను మించిన జీడీపీ వృద్ధితో సరికొత్త ఉత్సాహం.
ఢిల్లీ, మహా.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా శనివారం ఆయన ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సభ్యులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చేసేందుకు అవసరమైన సంస్కరణలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలపై చూపే ప్రభావం తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ముగిసిన మరుసటి రోజే ప్రధాని ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా తటస్థ వైఖరిని అవలంబిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ మేరకు లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ కింద రెపో రేటును ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయించింది. బ్యాంక్ రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ తదితర రేట్లను సైతం స్థిరంగా ఉంచారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, కీలక వాణిజ్య మార్గాలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఎదురైన ఇలాంటి పరిస్థితులతో పోలిస్తే నేడు భారత్ మరింత పటిష్టంగా ఉందని, సంక్షోభాలను దీటుగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. ఈ సవాళ్లనే అవకాశాలుగా మలచుకుని ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా విధానకర్తలు అడుగులు వేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
పశ్చిమాసియాలో రాజుకుంటున్న సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని మోదీ గత నెలలో ప్రజలకు చేసిన ఏడు కీలక విజ్ఞప్తులను ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేయడానికి (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రాధాన్యం ఇవ్వాలని, విదేశీ ప్రయాణాలను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించడంతో పాటు బంగారం కొనుగోళ్లను సైతం నియంత్రించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తట్టుకునేందుకు రవాణా విధానంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. సొంత వాహనాలకు బదులుగా మెట్రో, ఇతర ప్రభుత్వ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో కార్‌ పూలింగ్ పద్ధతిని ఆశ్రయించడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని ఆయన సూచించారు. సరుకు రవాణా కోసం ప్రధానంగా రైల్వే మార్గాలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించడం గమనార్హం. జూన్ 5న విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 7.8 శాతంగా నమోదు కాగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి అది 7.7 శాతంగా రికార్డైంది. స్థిర ధరల ఆధారంగా నాలుగో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.87.77 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.81.40 లక్షల కోట్లతో పోలిస్తే ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఇక ప్రస్తుత త్రైమాసికానికి నామినల్ జీడీపీ సైతం రూ.94.65 లక్షల కోట్లుగా అంచనా వేయడం భారత ఆర్థిక వ్యవస్థ దృఢత్వానికి అద్దం పడుతోంది.