Mahaa Daily Exclusive

  దేశ సమైక్యతకు రేవంత్ వ్యాఖ్యలు గొడ్డలిపెట్టు…

Share

దేశ సమైక్యతకు రేవంత్ వ్యాఖ్యలు గొడ్డలిపెట్టు.
* ఢిల్లీ పెద్దలకు సలాం కొట్టే సీఎంకు సిగ్గులేదా?
* పన్నెండేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల సాయం.
* రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే
* యాదగిరిగుట్టలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు.
యాదగిరిగుట్ట,మహా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీవీపీ, ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి నోటివెంట ఇలాంటి విభజన వ్యాఖ్యలు రావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ శిబిరంలో శనివారం ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని, అలాంటి పార్టీలో పనిచేయడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని ఆయన ఉద్ఘాటించారు.
**సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం**
ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి.. ఇలా అంతా ఉత్తరాది వారేనని, వారందరికీ తాను వెళ్లి సెల్యూట్ చేయాలా? అని సీఎం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశ అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని గౌరవించడంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల కోసం పదే పదే ఢిల్లీకి వెళ్లి సలాం కొడుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక, దేశం సాధిస్తున్న అద్భుతమైన ఆర్థిక ప్రగతిని జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతోందని విమర్శించారు.
**తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట**
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్నది పచ్చి అబద్ధపు ప్రచారమని రాంచందర్ రావు కొట్టిపారేశారు. గత పన్నెండున్నరేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులు, పథకాల రూపంలో ఏకంగా రూ.13 లక్షల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. ఇటీవల రూ.7,597 కోట్లతో ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారుల నాలుగు వరుసల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి పనులు కూడా ప్రారంభించిందని గుర్తుచేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్‌లో పారిశ్రామిక పార్క్, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు శంషాబాద్‌ పరిసరాల్లో ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత కూడా కేంద్రానిదేనన్నారు.
**కాంగ్రెస్ అవినీతి పాలన.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే**
ప్రజలచే నేరుగా ఎన్నికై వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, గత 12 ఏళ్లుగా దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని రాంచందర్ రావు ప్రశంసించారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మరో ఐదేళ్ల పాటు దేశానికి మోదీనే నాయకత్వం వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, కమిషన్ల దందాలు వెలుగుచూశాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్, ఢిల్లీ పెద్దల మెప్పు కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయలేవని స్పష్టం చేశారు.
**భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరాలి**
హైదరాబాద్ నగరాభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని రాంచందర్ రావు వివరించారు. అమృత్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ లాంటి పథకాలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పీఎం స్వనిధి ద్వారా నగరంలోని వేలాది మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించామని గుర్తుచేశారు. మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు నగరాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. భవిష్యత్తులో జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, దొంగ ఓట్లను తొలగించడంతో పాటు అర్హులకు ఓటు హక్కు కల్పించేలా బాధ్యతగా వ్యవహరించాలని రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.