జంతర్‌మంతర్ వద్ద ‘కాక్రోచ్ పార్టీ’ నిరసన.
* జాతీయ జెండా, పుస్తకంతో రావాలని అభిజీత్ పిలుపు.
* పోలీసులకు పూలిచ్చి కృతజ్ఞతలు చెప్పాలని సూచన.
* అభిజీత్‌ను అరెస్ట్ చేస్తే ఆరు వారాల దీక్షకు సోనమ్ వాంగ్చుక్ సిద్ధం.
ఢిల్లీ, మహా.
దేశ విద్యా వ్యవస్థలో లోపాలు, పోటీ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా శనివారం జిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పోలీసుల అనుమతి లభించినట్లు సీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. నిరసనలో పాల్గొనే వారంతా ఒక పుస్తకం, జాతీయ పతాకంతో రావాలని, పూర్తి క్రమశిక్షణతో, శాంతియుతంగా ఉద్యమించాలని తన మద్దతుదారులకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.
**పోలీసులకు పూలిచ్చి.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన**
జంతర్ మంతర్ వద్ద ప్రతి ఒక్కరినీ కలుసుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఈ ఉద్యమం పూర్తిగా ప్రేమ, శాంతి, రాజ్యాంగబద్ధమైన విలువల ఆధారంగానే సాగాలని ఆయన స్పష్టం చేశారు. నిరసన ప్రదర్శనలో ఎలాంటి హింసకు తావులేకుండా, అత్యంత సంయమనంతో వ్యవహరించాలని కోరారు. విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి పూలు అందించి కృతజ్ఞతలు తెలియజేయాలని మద్దతుదారులకు సూచించారు.
**అరెస్టు చేస్తే దీక్షకు దిగుతా: సోనమ్ వాంగ్చుక్**
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసన కార్యక్రమానికి తన మద్దతు ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం అభిజీత్ దీప్కేను అరెస్టు చేస్తే.. తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. నిరసనలో పాల్గొనే యువత అంతా అధికారులకు సహకరించాలని, కేవలం మొబైల్ ఫోన్లు, నీటి సీసాల వంటి అత్యవసర వస్తువులను మాత్రమే వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వస్తువులు లేదా ఆయుధాలతో వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
**రాజధానిలో వెయ్యి మందికి పైగా పోలీసుల మోహరింపు**
ఈ నిరసన నేపథ్యంలో దిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాలతో పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దిల్లీ సరిహద్దు ప్రవేశ మార్గాల్లో వెయ్యి మందికి పైగా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు. అయితే, ఈ నిరసనకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక అనుమతి అభ్యర్థనలు రాలేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఆధారంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
**పరీక్షల అక్రమాలపైనే పోరాటం..**
ఇటీవల కాలంలో దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్, సీబీఎస్‌ఈ ఫలితాలు, సీయూఈటీ, ఎస్ఎస్‌సీ వంటి కీలక పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సీజేపీ ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ సంస్థ పట్టుబడుతోంది. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అభిజీత్ దీప్కే నేతృత్వంలో సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ డిజిటల్ ఉద్యమానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న తొలి భౌతిక నిరసన ఇదే కావడం గమనార్హం.
**సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టిన పార్టీ**
గత నెలలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొంతమంది వ్యక్తులను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది. ఆ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రంగా (సటైరికల్‌గా) అభిజీత్ దీప్కే ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ఈ ప్రచారానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడిది పెద్ద ఎత్తున భౌతిక నిరసనకు దారితీయడంతో, ఈ ఆందోళన ఎంతవరకు శాంతియుతంగా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.








