నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కీచక పర్వం.
*ట్యూటర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.
*నిద్రమాత్రలు మింగిన బాధితురాలు.. పోలీసులకు వాంగ్మూలం.
*నిందితుడు గౌతమ్‌పై కేసు నమోదు.. విధుల నుంచి శాశ్వత బహిష్కరణ.
నిజామాబాద్, మహా.
ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు నిలపాల్సిన నర్సింగ్ విద్యార్థినులకే రక్షణ కరువైంది. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత మార్గంలో నడిపించాల్సిన ఒక ట్యూటర్ కీచకుడిగా మారాడు. వృత్తి ధర్మాన్ని మరిచి విద్యార్థినిని ఫోన్‌లో వేధింపులకు గురిచేశాడు. ఆ నరకాన్ని భరించలేక ఓ ద్వితీయ సంవత్సరం నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో తీవ్ర కలకలం రేపింది.
నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న ఒక ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై అదే కళాశాలలో పనిచేస్తున్న ట్యూటర్ గౌతమ్ గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెను ఫోన్‌లో పదేపదే సంప్రదిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక క్షోభకు గురిచేయడం ప్రారంభించాడు. విద్యాసంస్థలో తోటి వారికి చెప్పుకోలేక, అలాగని ఆ కీచకుడి వేధింపులు తట్టుకోలేక సదరు విద్యార్థిని తీవ్ర ఆవేదనకు గురైంది. రోజురోజుకూ ట్యూటర్ వేధింపులు శ్రుతిమించడంతో ఇక ప్రాణాలు తీసుకోవడమే శరణ్యమని భావించిన బాధితురాలు.. అత్యంత విషాదకర నిర్ణయం తీసుకుని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితురాలిని గమనించిన వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితురాలి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్యూటర్ గౌతమ్ తనను ఫోన్‌లో ఏ విధంగా వేధించాడో, తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఆ విద్యార్థిని పోలీసులకు స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు గౌతమ్‌పై వన్‌టౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరోవైపు, ఈ దారుణ ఘటనపై నర్సింగ్ కళాశాల ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్యూటర్ అకృత్యంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం, నిందితుడైన గౌతమ్‌ను కళాశాల విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (సస్పెండ్ చేస్తూ) కఠిన నిర్ణయం తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పే కళాశాలలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.








