పంట వ్యర్థాలను తగలబెట్టినరైతులు.
* 8 మంది రైతులకు రూ.5 వేల చొప్పున జరిమానా.
* జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో వ్యవసాయ శాఖ కొరడా.
* పర్యావరణానికి, భూసారానికి తీవ్ర ముప్పు అంటున్న అధికారులు.
జగిత్యాల, మహా.
పంట పొలాల్లో వరి కొయ్యలు (పంట వ్యర్థాలు) కాల్చే రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుండటంతో పాటు భూసారం దెబ్బతింటున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారామ్ తండాలో వరి కొయ్యలకు నిప్పుపెట్టిన ఎనిమిది మంది రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఏకంగా రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు.
రాజారామ్ తండాలో వరి కొయ్యలను కాల్చరాదని గతంలోనే గ్రామస్తులు పంచాయతీ తీర్మానం చేసుకున్నారు. అయినప్పటికీ కొందరు రైతులు గ్రామ పంచాయతీ నిబంధనలను పక్కనపెట్టి పంట వ్యర్థాలకు నిప్పంటించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సమక్షంలోనే సదరు ఎనిమిది మంది రైతులకు జరిమానా విధించి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వరి కొయ్యలను కాల్చడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో నంబర్ 27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా పంట వ్యర్థాలను తగలబెడితే, పర్యావరణ పరిహారం కింద తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు భారీ జరిమానాలు విధిస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల ద్వారా ఈ జరిమానాలను వసూలు చేస్తామని హెచ్చరించారు.
పంట కోతల అనంతరం మిగిలిపోయే వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొయ్యలను తగలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు, భూమిలోని సేంద్రియ కర్బనం, రైతు మిత్రులైన వానపాములు, ఇతర మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోయి భూసారం పూర్తిగా దెబ్బతింటుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కోసారి మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న ఆయిల్ పామ్, మామిడి తదితర వాణిజ్య పంటల తోటలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా, రోటవేటర్ల ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని భూమిలో కలియదున్ని నేల సారాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.








