Mahaa Daily Exclusive

  కొహెడలో కొంగొత్త వెలుగులు…

Share

కొహెడలో కొంగొత్త వెలుగులు.
* అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన.
* రూ.2,284 కోట్లతో 239 ఎకరాల్లో సమీకృత మార్కెట్ నిర్మాణం.
* రూ.20 కోట్లతో సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.
*తొమ్మిది నెలల్లోనే కార్యాలయ భవన నిర్మాణ పూర్తికి లక్ష్యం.
* రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు.. విపక్షాలవి అసత్య ఆరోపణలే.
అబ్దుల్లాపూర్‌మెట్,మహా.
రాష్ట్ర రాజధాని శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ వద్ద సరికొత్త అభివృద్ధి శకానికి అంకురార్పణ జరిగింది. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక హంగులతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులతో కలిసి సీఎం ఈ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. సుమారు 239 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.2,284 కోట్లకు పైగా భారీ నిధులతో సకల సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం ఇక్కడ తీర్చిదిద్దనుంది.
**సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నవీకరణ**
ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో హైదరాబాద్ పరిధిలోని మొత్తం 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే కొహెడలో నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.20 కోట్లతో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి సైతం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక కార్యాలయ నిర్మాణాన్ని రాబోయే తొమ్మిది నెలల లోపే శరవేగంగా పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం కొహెడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలు పాల్గొని ప్రసంగించారు.
**రైతులు, భూ యజమానులకే అసలైన లబ్ధి**
రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూ విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయని నేతలు వేదికపై నుంచి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య ప్రజలపై పన్నుల భారం పడకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదని గుర్తుచేశారు. కేవలం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ ధరలను (భూ విలువను) మాత్రమే సవరించడం జరిగిందని, దీనిపై ప్రతిపక్ష నాయకులు కావాలనే అవాస్తవాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 6 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని ఏడున్నర శాతానికి పెంచి ప్రజల నడ్డి విరిచిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తాము తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఒకవైపు రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములు కోల్పోయే రైతులు, నిజమైన భూ యజమానులకు అత్యధిక నష్టపరిహారం లభించి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ శాసన సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.